చంద్రగిరిలో రౌడీ రాజకీయాలను తరిమికొట్టండి | Mithun Reddy Fires On TDP Govt | Sakshi
Sakshi News home page

చంద్రగిరిలో రౌడీ రాజకీయాలను తరిమికొట్టండి

Dec 31 2018 8:41 AM | Updated on Dec 31 2018 8:41 AM

 Mithun Reddy Fires On TDP Govt  - Sakshi

తిరుపతి రూరల్‌: చారిత్రక నేపథ్యం కలిగిన చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా దిగుమతి అయిన నేత తీసుకువస్తున్న రౌడీ రాజకీయాల సంస్కృతిని తరిమికొట్టాలని రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం పంచాయతీకి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు బీగాల చంద్రమౌళి కుటుంబంతో పాటు ఆయన అనుచరులు, నాయకులు, కార్యకర్తలు ఆదివారం పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఓటేరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 పంచాయతీలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. చంద్రమౌళితో పాటు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రశాంత పల్లెల్లో దౌర్జన్యాలను చేసి ప్రజలను భయభ్రంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దళితులపై దౌర్జన్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దళితుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. చిత్తూరులో తోక జాడించినందుకే అక్కడ తరిమికొట్టారని, ఇక్కడికి పారిపోయి వచ్చి రౌడీ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తి చెవిరెడ్డి కాదని, కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడని కొనియాడారు. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను అభివృద్ధే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా అందరితో కలిసి ఉన్నానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. గల్లా అరుణమ్మ ఉన్నప్పుడు కూడా హుందాగా రాజకీయాలు చేశామన్నారు. పార్టీలను విమర్శించేలా, నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టేలా అరుణమ్మ కానీ, తాను కానీ ఎప్పుడు చేయలేదని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రికెట్‌ టోర్నమెంట్, చదువుల్లో ప్రతిభా కలిగిన వారికి మెడల్స్, సర్టిఫికెట్లను, కంప్యూటర్లను అందించటం, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు నూతన వస్త్రాలను బహుకరించటం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన చంద్రమౌళి పోరాటయోధుడని ఎమ్మెల్యే చెవిరెడ్డి కొనియాడారు. అతని బాధ్యత తనదని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ కుటుంబంలో అతనికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందన్నారు.

నాని అనుచరుల అవినీతిపై పోరాడుతా...
పంచాయతీలో అవినీతికి పాల్పడటమే కాకుండా, భూకబ్జాలకు తెగబడుతున్న నాని అనుచరుల అక్రమాలు, అవినీతిపై పోరాడుతానని బీగాల చంద్రమౌళి పేర్కొన్నారు. టీడీపీలో భూకబ్జారాయుళ్లు, అక్రమార్కులకే పెద్దపీట వేస్తున్నారని, నాని సైతం వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, అలాంటి వాటికి భయపడే వ్యక్తులు కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మునికృష్ణయ్య, పార్టీ మండల ఇన్‌చార్జి ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మండల కో–ఆష్షన్‌ సభ్యులు ఓటేరు బాషా, చిరంజీవి, మధు, గంగిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement