‘ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం’

Minister Adimulapu Suresh Participated In State Level Education Seminar - Sakshi

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, విజయవాడ: విద్యావ్యవస్థలో సంస్కరణలు తెస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఏపీ మండల విద్యాశాఖాధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి విద్యాసదస్సులో మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వ బడులను బలోపేతం చేసి..ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నియంత్రిస్తామని పేర్కొన్నారు. మండల విద్యాశాఖ అధికారుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రశార్థకంగా మారిన ఎంఈవోల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఐదు నెలల్లో విద్య,వైద్య,రవాణా అన్ని శాఖలను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. ఎంఈవోల ప్రమోషన్లు,ఖాళీల భర్తీలు చేపడతామన్నారు. డ్రాయింగ్‌, డిస్పెన్స్‌ అధికారాలను ఎంఈవోలకు కల్పిస్తామని చెప్పారు. డీఈవోలను కూడా జేడీ స్థాయిలో వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ఎడ్యుకేషన్‌ రీఫామ్‌ కమిటీ నివేదిక ఇచ్చిందని..పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం..
యూనిఫైడ్ సర్వీస్ నిబంధనల పై కూడా అందరికి ఆమోద యోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.  స్కూల్, హైయర్ ఎడ్యుకేషన్ లో  రెండు ఫీజు రెగ్యులేషన్ కమిటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఈవో కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీర్చడంతో పాటు, సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. మొదటి,నాలుగో శనివారం నో స్కూల్‌ బ్యాగ్‌డే తీసుకువచ్చామన్నారు. డైట్‌ పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ‘ఎన్ని కష్టాలు ఉన్నా విద్యాశాఖకు నిధులు కేటాయించాలి. ఉపాధ్యాయులకు అన్ని వసతులు కల్పించి విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని’ ఆదిమూలపు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న రాష్ట్ర రథ సారధి వైఎస్‌ జగన్‌కు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top