ఆరని సందేహాల మంటలు

Many Doubts About Tug Ship Fire In Visakha Harbor - Sakshi

 టగ్‌ ప్రమాదంపై  ఎన్నో అనుమానాలు

ప్రమాద కారణంపై ఇంకా అస్పష్టత

టగ్‌లో ఉన్న సిబ్బంది  సంఖ్యపైనా భిన్నస్వరాలు

26 మంది ఉన్నారంటున్న పోర్టు వర్గాలు

23 మందేనన్నది పోలీసువర్గాల లెక్క

వాస్తవానికి దాని సామర్థ్యం 20 మందే

ఇప్పటికీ నోరు మెదపని హెచ్‌పీసీఎల్‌

ఔటర్‌ హార్బర్‌ జలాల్లో హెచ్‌పీసీఎల్‌ అద్దెకు తీసుకున్న టగ్‌ను అంటుకున్న మంటలను గంటల తరబడి శ్రమించి సోమవారం అర్ధరాత్రికి అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంపై సందేహాల మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ప్రమాదానికి దారితీసిన కారణాలేమిటి?.. ప్రమాద సమయంలో టగ్‌లో ఎంతమంది ఉన్నారు??.. అందులో ఉండాల్సిన సిబ్బంది సంఖ్య ఎంత???.. నిర్దేశించిన దానికంటే ఎక్కువమంది ఉంటే, వారెలా నౌకలోకి వచ్చారు????.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. టగ్‌ను అద్దెకు తీసుకొని పనులు నిర్వహిస్తున్న హెచ్‌పీసీఎల్‌ సంస్థ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదు. కానీ ఆ సంస్థ అధికారులు మంగళవారం రాత్రి వరకు నోరు విప్పలేదు.. ఎటువంటి ప్రకటనలూ జారీ చేయలేదు. ఘటనపై అంతర్గత విచారణకు మాత్రమే ఆ సంస్థ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ప్రమాదం నుంచి మొత్తం 24 మందిని పోర్టు, కోస్ట్‌గార్డు సిబ్బంది రక్షించి ఆస్పత్రులకు తరలించారు. వారిలో తొమ్మిది మందిని ప్రాథమిక చికిత్స అనంతరం సోమవారం రాత్రే పంపించేశారు. ఆరుగురిని మంగళవారం డిశ్చార్జి చేశారు. మిగిలిన 9 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ముంబైలోని హెచ్‌పీసీఎల్‌ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ఇక్కడి డాక్టర్లు నివారించారు. కాగా సంఘటనపై విచారణ జరుగుతోందని.. రెండు రోజుల తర్వాత గానీ పూర్తి వివరాలు చెప్పలేమని పోలీసులు అంటున్నారు.

సాక్షి, విశాఖపట్నం/పాతపోస్టాఫీస్‌/ మల్కాపురం: ఔటర్‌ హార్బర్‌ సముద్ర జాలాల్లో క్రూడ్‌ ఆయిల్‌ నౌకలను నిలిపి ఉంచే సింగిల్‌ పాయింట్‌ మూరింగ్‌ (ఎస్‌పీఎం) టెర్మినల్‌ వద్ద హెచ్‌పీసీఎల్‌కు చెందిన అద్దె నౌక కోస్టల్‌ జాగ్వార్‌లో సోమవారం ఉదయం 11.25 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సమాచారం పోర్ట్‌ మెరైన్‌ సమాచారంతో విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ మంటలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగింది. మంటలను అదుపు చేసేందుకు సీ లైన్‌ అజిల్, సీ లైన్‌ సెంటినల్, సర్దార్‌ పటేల్, ఫైర్‌ ఫ్లోట్‌ అనే క్రాఫ్ట్‌లను పంపింది. వీటితో పాటు కోస్ట్‌గార్డ్‌కు చెందిన రాణి రష్మోణీ, సీజీ 81 నౌకలు సమన్వయంతో అత్యంత చాకచక్యంగా మంటలను అతి కష్టమ్మీద అదుపులోకి తీసుకువచ్చాయి. విశాఖపట్నం పోర్ట్‌ట్రస్ట్, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది నిరంతరం శ్రమించి సోమవారం రాత్రికి మంటలు, దట్టమైన పొగ పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అనంతరం పోర్ట్‌ సిబ్బంది ప్రమాదానికి గురైన కోస్టల్‌ జాగ్వార్‌ను ఇన్నర్‌ హార్బర్లోకి తరలించినట్లు పోర్టు వర్గాలు తెలిపాయి.

ఎంతమంది ఉన్నారు?
ఈ ప్రమాదం ఎలా జరిగింది.? కారణాలేంటన్న విషయాలపై ఇంకా స్పష్టత లేదు. అసలు ప్రమాదం సంభవించినప్పుడు నౌకలో ఎంతమంది ఉన్నారన్న విషయంపై తలో మాట చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు సమయంలో కోస్టల్‌ జాగ్వార్‌లో 26 మంది ఉన్నట్టు సమాచారం ఉందని పోర్టు వర్గాలు చెబుతుండగా.. 23 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పనికి పంపిన హెచ్‌పీసీఎల్‌ మాత్రం నౌకలో ఎంతమంది ఉన్నారన్న విషయంపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించకపోవడం  అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి టగ్‌లో 20 మంది మాత్రమే ఉండాలి. కానీ.. పోలీసుల సమాచారం ప్రకారం 23 మంది ఉన్నారు. అదనంగా ముగ్గురు నౌకలోకి ఎలా వచ్చారు.? అధికారికంగా వచ్చారా.? అనధికారికంగా నౌకలో ఉన్నారా అనే విషయంపై కూడా ఇంతవరకూ స్పష్టత రాలేదు.

మెరుగైన వైద్యం కోసం ముంబైకి.. కానీ..?
ప్రమాదం జరిగినప్పుడు ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. 24 మందిని పోర్ట్, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరిలో 9 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు సోమవారం ఇంటికి పంపారు. మిగిలిన 15 మందికి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగుర్ని చికిత్స అనంతరం మంగళవారం ఇంటికి పంపారు. మరో తొమ్మిది మంది ప్రస్తుతం మైక్యూర్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు 90 శాతం కాలిన గాయాలతో ఉన్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మిగిలిన వారు 40 శాతం పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. 

క్షతగాత్రులకు ఆంధ్ర మెడికల్‌ కళాశాల ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌రావు పర్యవేక్షణలో వైద్య సేవలందిస్తున్నారు. అయితే విశాఖకు చెందిన  కాశారపు భరధ్వాజ్‌ (23) పరిస్థితి మరింత విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌మీద చికిత్స పొందుతున్నారు.  కోల్‌కతాకు చెందిన అన్సార్‌ (39)కు కాలేయానికి తీవ్ర గాయాలవ్వడంతో పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కేరళకు చెందిన జోబిన్‌కు కూడా 65 శాతం శరీరం కాలిపోవడంతో విషమంగా ఉందన్నారు. హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం ఒత్తిడితో విషమంగా ఉన్న ముగ్గురు క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ప్రధాన ఆస్పత్రికి తరలించడానికి సన్నాహాలు చేశారు. అయితే.. ఈ సమయంలో వీరిని తరలిస్తే పరిస్థితి మరింత విషమంగా అవుతుందని డాక్టర్‌ పీవీ సుధాకర్‌ రావు చెప్పడంతో.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మిగిలిన ఆరుగురి పరిస్థితి కొంతమేర మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.  
  
స్పందించని  హెచ్‌పీసీఎల్‌..
ఈ ఘటనపై ఇంతవరకూ హెచ్‌పీసీఎల్‌ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.  నౌకలో ఎంతమంది ఉన్నారు.. ఎవరెవరు వెళ్లారు అనే వివరాలను జిల్లా యంత్రాంగానికి కూడా ఇవ్వలేదు. సంస్థ యాజమాన్యం మాత్రం ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. విచారణ కమిటీ మ«ధ్యాహ్నం 2 గంటల సమయంలో రిఫైనరీని సందర్శించి ఆపరేషనల్‌ జీఎం, ఇండస్ట్రీ జీఎంలతో పాటు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు సమాచారం. బుధవారం నాటికి నివేదిక సిద్ధం అవుతుందని హెచ్‌పీసీఎల్‌ వర్గాలు చెబుతున్నాయి.

క్షతగాత్రులకు మంత్రి అవంతి పరామర్శ..
విశాఖ హార్బర్‌ సముద్ర తీరంలో సోమవారం ఉదయం జరిగిన  జాగ్వర్‌ టగ్‌(నౌక)ప్రమాదంలో గాయపడి మైక్యూర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్, పోర్ట్‌ డిప్యూటీ చైర్మన్‌ పీఎల్‌ హరనాథ్, జేసీ–2 వెంకటేశ్వరావు, డీఎంహెచ్‌వో తిరుపతిరావులు పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మొరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. 

ప్రమాదంపై ఆరా తీసిన అధికారులు..
హార్బర్‌ తీరంలో జరిగిన జాగ్వర్‌ టగ్‌(నౌక)ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌ వేసిన కమిటీ ఆరా తీసింది. టగ్‌లో రిపేర్‌ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారుల విచారణలో తేలింది.హెచ్‌పీసీఎల్‌(విశాఖ రిఫైనరీ)కి అవసరమైన క్రూడ్‌ ఆయిల్‌ అన్‌లోడ్‌ చేసేందుకు సోమవారం నౌక వచ్చింది. ఈ నౌక పోర్టు పరిధిలోని హెచ్‌పీసీఎల్‌కు పైపులైన్‌ ద్వారా పంపే పాయింట్‌ వద్ద ఉంది. అయితే ఈ నౌక నుంచి పైపులైన్‌ ద్వారా క్రూడ్‌ అన్‌లోడ్‌ చేయాలంటే దానికి అటాచ్డ్‌ (అంటే నౌక వద్ద గల అన్‌లోడ్‌ పాయింట్‌కు పైపులైన్‌ పాయింట్‌కు కలిపేది)ఎడ్జిస్‌బుల్‌ పైపులు అవసరం. ఈ పనులు సామారో అనే సంస్థ నిర్వహిస్తోంది. హెచ్‌పీసీఎల్‌ ఆ సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. ఈ నౌకలో పనులకు కొమాకో అనే సంస్థ నుంచి సిబ్బందిని విధులకు తీసుకొచ్చారు. అయితే సదరు కాంట్రాక్టర్‌ క్రూడ్‌ అన్‌లోడ్‌ చేసేం దుకు టగ్‌(ప్రమాదానికి గురైన నౌక)లో 23 మంది సిబ్బందితో సోమవారం ఉదయం వస్తున్నాడు.అయితే ప్రమాదానికి పది నిమిషాల ముందు నౌకలో సింగల్‌ పాయింట్‌ మోడ్‌æ వద్ద సిబ్బంది రిపేర్‌ పనులు చేస్తున్నారు.ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  దీనిపై పూర్తి వివరాలు రావాలంటే మరో రెండు రోజులు పడుతోందని సీఐ ఉదయ్‌కుమార్‌ తెలిపారు.అయితే ప్రమాదంపై హెచ్‌పీసీఎల్‌ అధికారులు మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసినట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top