నవంబర్ 3న విశాఖ శివారులో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో భారీగా మాంసం గుర్తింపు
శాంపిళ్లు పరిశీలించగా గోమాంసం ఉన్నట్లు నిర్ధారణ
విదేశాలకు ఎగుమతి చేస్తున్న మహమ్మద్ ఫర్హాన్‌తోపాటు మరో ఇద్దరి అరెస్ట్
వివరాలు వెల్లడించిన లా అండ్ ఆర్డర్ డీసీపీ –1 వీఎన్ మణికంఠ
సాక్షి, తగరపువలస (విశాఖపట్నం): విశాఖ జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో పట్టుబడిన 189 టన్నుల గో మాంసాన్ని న్యాయస్థానం ఆదేశాల మేరకు జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ బోర్డు, పశు సంవర్థకశాఖ, రెవెన్యూ, పోలీసుల పర్యవేక్షణలో పూడ్చివేయనున్నట్టు లా అండ్ ఆర్డర్ డీసీపీ – 1 వి.ఎన్.మణికంఠ చందోలు తెలిపారు. సోమవారం ఆయన ఆనందపురంలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గోవులను వధించి వాటి మాంసాన్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తున్న నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఇటీవల గుజరాత్, కోల్‌కతా, విశాఖ పోర్టుల్లో తనిఖీ చేసిన సమయంలో శొంఠ్యాం శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజీని కూడా తనిఖీ చేశారని తెలిపారు. నవంబరు 3న విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, ఆనందపురం పోలీసులు కోల్డ్ స్టోరేజీకి వెళ్లేసరికి గేదె మాంసం పేరుతో మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ విదేశాలకు పంపించడానికి సిద్ధంగా ఉన్న వాటి నుంచి ఆరు శాంపిళ్లు తీసి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారన్నారు.
87,945 కిలోల నుంచి తీసిన మూడు శాంపిళ్లలో ఆవు మాంసం, 37,656 కిలోల నుంచి తీసిన రెండు శాంపిళ్లలో ఎద్దు మాంసం, 18,720 కిలోల నుంచి తీసిన ఒక శాంపిల్‌లో గేదె మాంసం ఉన్నట్టు తేలిందన్నారు. మిగిలిన 45,416 కిలోల మాంసం నుంచి ఎనిమిది శాంపిళ్లను కూడా ల్యాబ్‌కు పంపించినట్టు తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో ఎక్కువ భాగం ఆవు మాంసం ఉండడంతో... ఆవులను వధించడం చట్టరీత్యా నేరమైనందున అదే రోజు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం 189 టన్నుల మాంసాన్ని సీజ్ చేశారని పేర్కొన్నారు.
ఎగుమతిదారుడు, ఇద్దరు సరఫరాదారుల అరెస్ట్
విచారణలో భాగంగా గో మాసం ఎగుమతిదారుడైన మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని మహమ్మద్ ఫర్హాన్‌ను అరెస్ట్ చేశామని, ఆవు మాంసం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేసే రాకెట్‌లో ఉన్నవారిని కూడా గుర్తించామన్నారు. మహారాష్ట్రలోని లోనావాలాకు చెందిన గోమాంసం సరఫరాదారుడు మన్సూర్ ఆలీని ప్రధాన నిందితుడిగా, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మరో సరఫరాదారుడు రషీద్ ఖురేషీని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ విచారణ చేపట్టామన్నా రు. ఈ ముఠా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆవులను వధించి తప్పుడు ఇన్వాయిస్‌లు, వే బిల్లులు, హెల్త్ సర్టిఫికెట్లు సృష్టించి గేదె మాంసం పేరుతో విశాఖ పోర్టు ద్వారా ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. ఈ నెట్‌వర్క్‌లో మొత్తం 9 మంది వున్నారని, మిగిలిన నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.


