నేడే ‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు

Latest Duty Procedures in Finalizing Reservation for Local body Elections - Sakshi

50 శాతం మించకుండా విధివిధానాలు 

2వ తేదీనే ప్రభుత్వ ఉత్తర్వులు  

జిల్లా యూనిట్‌గా ఎంపీపీ, జడ్పీటీసీ, మండలం యూనిట్‌గా సర్పంచి, ఎంపీటీసీలకు రిజర్వేషన్లు

సాక్షి, అమరావతి: హైకోర్టు తీర్పునకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా గురువారం ఖరారు కానున్నాయి. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు పంచాయతీరాజ్‌ శాఖ తాజాగా నేటి మధ్యాహ్నంలోగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. జిల్లాలవారీగా గెజిట్‌ జారీ చేసి ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కాపీని అందచేయడంతోపాటు వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు శుక్రవారం రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది.

హైకోర్టు తీర్పు వెలువడగానే విధివిధానాలపై ఉత్తర్వులు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌లోనే ఉత్తర్వులు ఇచ్చింది. మంత్రివర్గ సమావేశంలోనూ ఆమోదించింది. ఆమేరకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పదవుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నూతన విధివిధానాలను ఖరారు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారులో అనుసరించాల్సిన నియమ నిబంధనలపై హైకోర్టు తీర్పు వెలువడిన 2వ తేదీనే పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 

రిజర్వేషన్ల ఖరారులో తాజా విధివిధానాలు..
- ఒక మండలంలో జెడ్పీటీసీ, మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాలు ఒకే కేటగిరీ రిజర్వేషన్‌లో ఉంచకూడదు. ఉదాహరణకు ఏదైనా మండలంలో జెడ్పీటీసీ బీసీ జనరల్‌కు రిజర్వయితే ఎంపీపీ పదవి అదే కేటగిరికీ రిజర్వు చేయకూడదు. ఎంపీపీని బీసీ మహిళ లేదా మరే ఇతర రిజర్వేషన్‌ కేటగిరీకి రిజర్వు చేయవచ్చు. 
- జెడ్పీటీసీని ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన మండలంలో ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్‌ చేయడానికి వీల్లేదు. అదే సమయంలో జెడ్పీటీసీ అన్‌ రిజర్వు కేటగిరిలో ఉన్న మండలంలో ఎంపీపీ పదవి అన్‌ రిజర్వు కేటగిరిలో ఉండవచ్చు. 
గ్రామ సర్పంచి, ఎంపీటీసీ పదవులను మండల జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 
- మండలంలో సర్పంచి లేదా ఎంపీటీసీ పదవులను ఏ కేటగిరికి ఎన్ని రిజర్వు చేస్తారన్నది ఆ ప్రాంత ఆర్డీవో ఖరారు చేస్తారు. ఏ స్థానం ఏ కేటగిరికి రిజర్వు చేశారన్నది ఆర్డీవోనే ఖరారు చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 
- ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను జిల్లాలోని మొత్తం జనాభా ప్రాతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 
- జిల్లాలోని బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 
- జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలు మొత్తం స్థానాల్లో సగానికి మించకూడదు. 
- జిల్లాలో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని స్థానాలు రిజర్వు చేయాలన్నది కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఏ స్థానాలు ఏ కేటగిరికి కేటాయిస్తారో కలెక్టరే ఖరారు చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.
- జెడ్పీ చైర్మన్‌ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ నిర్ధారిస్తారు. 
రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న హైకోర్టు తీర్పు మేరకు 13 జడ్పీ చైర్మన్‌ పదవుల్లో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు మూడు చొప్పున రిజర్వు అవుతాయని పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
ఏడు జడ్పీ చైర్మన్‌ పదవులు అన్‌ రిజర్వు కేటగిరిలో ఉంటాయి. 
షెడ్యూల్‌ ఏరియాలో మాత్రం ఎస్టీలకు ఒకే మండల పరిధిలో ఎంపీటీసీ, గ్రామ సర్పంచి పదవులకు 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ మేరకు రాజ్యాంగంలోనే స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. 
- షెడ్యూల్‌ ఏరియాలో ఉండే జెడ్పీటీసీ పదవులను పూర్తిగా ఎస్టీలకే రిజర్వు చేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top