అందరి చూపు ఆట వైపు..


నేటి నుంచి ప్రపంచ క్రికెట్ పోటీలు

ఆదివారం భారత్ -పాకిస్తాన్ మ్యాచ్

జోరందుకోనున్న బెట్టింగులు

ఆన్‌లైన్ బెట్టింగులకే ప్రాధాన్యం


 

చిత్తూరు : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న  ప్రపంచకప్ క్రికెట్  పోటీలు శనివారం ప్రారంభంకానున్నాయి. తొలిరోజు  న్యూజిలాండ్-శ్రీలంక,ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య పోరు మొదలు కానుంది. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ దాయాదుల పోరు ఆదివారం  అడిలైడ్‌లో జరగనుంది. ఆ తరువాత భారత్ ఈ నెల 22న దక్షిణాఫ్రికాతో,28న యుఏఈతో,మార్చి 6న వెస్టిండీస్‌తో,10న ఇంగ్లండ్‌తో,14న జింబాబ్‌వేతో తలపడనుంది. మార్చి 29న ప్రపంచకప్ ఫైనల్ పోటీలు జరగనున్నాయి. నాలుగేళ్లకొకసారి జరిగే ప్రపంచకప్ పోటీల కోసం  క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురు  చూస్తున్నారు. ఎక్కడ చూసినా క్రికెట్ చర్చే. గత ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న  భారత్  ఈ ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంటుందా.. అందుకు అవసరమైన బలముందా..ప్రస్తుతం ఆటగాళ్ల ఆటతీరు ఎలా ఉంది..ఈ ప్రపంచకప్‌లో ఎవరు ఫేవరెట్‌గా నిలువబోతున్నారు తదితర  అంశాలపై  చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఏ నలుగురు  యువకులు కలిసినా ఇదే చర్చ. మొత్తంగా ప్రపంచకప్ క్రికెట్ పండుగ సందడి షురూ అయింది. మరోవైపు  మార్చిలోనే  ఇంటర్,పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ మొదలయ్యాయి. ఆ తరువాత డిగ్రీ పరీక్షలు సైతం జరగనున్నాయి. ఇదే సమయంలో ప్రపంచకప్ క్రికెట్ పోటీలు  జరగనుండడంతో విద్యార్థులు చదువుపై సరిగా దృష్టి పెట్టే పరిస్థితి ఉండదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.జోరందుకోనున్న బెట్టింగులు..జిల్లాలో క్రికెట్ బెట్టింగులు జోరందకోనున్నాయి.మదనపల్లె,తిరుపతి పలమనేరుతో పాటు జిల్లా వ్యాప్తంగా  పలుప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ మేరకు పోలీసులు  బెట్టింగు రాయుళ్లపై కేసులు సైతం నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రపంచకప్ సందడి నేపధ్యంలో జిల్లాలో బెట్టింగులు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు క్రికెట్ బెట్టింగులపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల తాకిడి తప్పించుకునేందుకు బుకీలు ఆన్‌లైన్  బెట్టింగులకు తెరలేపారు. అన్ని లావాదేవీలు ఆన్‌లైన్‌లో సాగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొందరు బుకీలు గతంలోలాగా హోటళ్లు లాడ్జీలలోనేకాక  అపార్ట్‌మెంట్లు,ఇళ్లలోనే క్రికెట్ బెట్టింగులు నడిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top