ఐటీ సోదాలు; టీడీపీ నేతల టెన్షన్‌

Income Tax Raids on Prathipati Sarath Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ‌/కడప: ఆదాయపన్ను శాఖ దాడులతో టీడీపీ నాయకుల అక్రమాల డొంక కదులుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితులైన వారి ఇళ్లు, కార్యాలయాల్లో గురువారం మొదలైన ఐటీ శాఖ సోదాలు నేడు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్‌కు చెందిన ఆవేక్సా కార్పొరేషన్ కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

మరోవైపు మాదాపూర్‌లోని డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ డైరెక్టర్‌ను అరెస్ట్‌ చేసినట్టు డైరెక్టరేట్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) ప్రకటించింది. తప్పుడు ఇన్వాయిస్‌లు సృష్టించి 69 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ మేరకు చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. డీఎన్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ యాజమాని నరేన్‌ చౌదరికి టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలున్నట్టు తెలుస్తోంది. నారా లోకేశ్ అనుచరుడు కిలారి రాజేశ్‌తో నరేన్‌ చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమాచారం. కిలారి రాజేశ్‌కు చెందిన రెండు ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కిలారు రాజేష్ వ్యవహారంతో చంద్రబాబు, లోకేశ్‌ టెన్షన్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో రాజేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.

రెండో రోజూ కొనసాగుతున్న సోదాలు
కాగా, చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు నివాసంలో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 9 మందితో కూడిన ఐటీ అధికారుల బృందం నిన్నటి నుంచి సోదాలు కొనసాగిస్తోంది. మరోవైపు సీఆర్‌పీఎఫ్‌ అదనపు సిబ్బంది ఈ ఉదయం శ్రీనివాసరావు నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సోదాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశముందని ఐటీ వర్గాలు వెల్లడించాయి.

జాడ లేని శ్రీనివాసులరెడ్డి
తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి(వాసు) హైదరాబాద్ కార్యాలయంలో ఐటీ సోదారులు ఈ ఉదయం ముగిశాయి. పలు కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప ద్వారకానగర్‌లో ఉన్న శ్రీనివాసులరెడ్డి నివాసంలో దాదాపు 30 గంటల పాటు సాగిన సోదాలు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే ఐటీ అధికారులు వెళ్లిపోయారు. శ్రీనివాసులరెడ్డి ఎక్కడ ఉన్నారనేది తెలియరాలేదు. వరుస ఐటీ దాడులతో టీడీపీ ముఖ్య నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ అక్రమాలు బయటపడతాయన్న భయంతో టీడీపీ నేతలు వణుకుతున్నారు. (చదవండి: చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top