సాక్షి, నెల్లూరు జిల్లా: కూటమి సర్కార్ 19 నెలల పాలన కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని.. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు పెట్టుబడులు ఆకర్షించడంలో దిట్టలు అన్నట్టుగా బాకాలు ఊదుతున్నారు. రకరకాల ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ప్రచారాలు, ట్వీట్లు ఏ ప్రాంతం నుండి చేస్తున్నారో చెప్పలేరా? మీరు ఉంది.. ఏమైనా రహస్య ప్రదేశమా?. తెలియపరచకూడదా?. చంద్రబాబు, లోకేష్ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘వారం రోజులు నుండి లోకేష్ పత్తాలేడు, చంద్రబాబు నాలుగు, ఐదు రోజులుగా జాడ లేదు. మీకు వున్న అనుకూల ఎల్లో మీడియాకు కూడా పాపం సమాచారం లేదు. ప్రజల్లో మీ జాడ ప్రస్తావన వస్తుందంటూ ఈ ట్వీట్ల డ్రామా చేస్తున్నారు. గతంలో కుమార్తెను చూడటానికి వైఎస్ జగన్ లండన్‌కు వెళ్తే బాబు హంగామా చేశారు’’ అంటూ కాకాణి దుయ్యబట్టారు.
‘‘నేడు రాష్ట్రంలో అపారమైన పెట్టుబడులని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలకు మాత్రం మొదటి స్థానం అని ఓ పత్రిక రాసింది. ఎన్ని కంపెనీలు కార్యరూపం దాల్చాయి అంటే ఐదు శాతం కూడా లేదు. 2014-19 మధ్యన 1761 కంపెనీలతో ఎంవోయూలు, 18.87 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నాడు. అందులో కార్యరూపం దాల్చింది 10 శాతం మాత్రమే, అంటే 90 శాతం అబద్ధాలే.
..అమరావతి నుండి విశాఖకు హైపర్ లూప్ అన్నాడు.. ఎక్కడ..?. కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ అన్నాడు.. ఎక్కడ ?. ఏవియేషన్, విమానాల తయారీ అన్నాడు.. ఎక్కడ బాబు..?. ఏయిర్ బస్సు, మైక్రోసాఫ్ట్ రకరకాల పేర్లు చెప్పాడు. 2023 మా హయాంలో 394 ఒప్పందాలు చేసుకున్నాము. 13.15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి అంచనా వేశాం. తద్వారా 6.16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నాం. మొదటి సంవత్సరంలోనే 20 శాతం ఎంవోయూలు కార్యరూపం దాల్చాయి. జగన్ నిర్ణయాలు, సంస్కరణలతో 91.6 శాతం కార్యరూపం దాల్చాయి. కరోనా విపత్కర పరిస్థితిల అనంతరం 17.700 లక్షల కోట్లు పెట్టుబడులు వాస్తవ రూపం చేశాం. వాస్తవాలు దాచి 2019-24 మధ్యలో ఏపీ బ్రాండ్ నాశనం అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారు’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు.


