విద్యార్థులపై అక్రమ కేసులు

Illegal cases of students with the pretense of posting in social media - Sakshi

సీఎం చంద్రబాబుఫొటో మార్ఫింగ్‌ చేశారని ఆరోపణ

తమకేమీ సంబంధం లేదని లబోదిబోమంటున్న విద్యార్థులు

విచారణ పేరుతో రోజంతా స్టేషన్‌లోనే ఉంచి వేధింపులు

అక్కడికెళ్లిన సాక్షి సిబ్బందిపై చిందులు తొక్కిన ట్రైనీ ఎస్సై

పట్నంబజారు(గుంటూరు): సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెట్టారనే నెపంతో విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టి వారిని తీవ్ర ఇబ్బందులు గురిచేసిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారనే కారణంతోనే తమను పోలీసులు వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. కొద్ది రోజుల కిందట ఫేస్‌బుక్‌లో చంద్రబాబు ముఖానికి వేరే ఫొటోను తగిలించి కొందరు పోస్టు చేశారంటూ టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అరండల్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం కేఎల్‌ యూనివర్సిటీలో బీబీఏ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న పోలారెడ్డి జగదీష్‌రెడ్డి, విజయవాడ ఎస్‌ఆర్‌కే కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసిన ఐనవోలు యశ్వంత్, గోగిరెడ్డి సాయివైభవ్, ఏఎన్‌యూలో డిగ్రీ చదువుతున్న గుంటూరుకు చెందిన మద్దు విజయ్‌బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాయంత్రం వరకు విచారించి జగదీశ్వరరెడ్డి, యశ్వంత్‌లను స్టేషన్‌లోనే రాత్రికి ఉంచారు. తిరిగి గురువారం కూడా విచారణ పేరుతో సాయంత్రం వరకు ఉంచారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా పార్లమెంటరీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పోలీసు స్టేషన్‌కు చేరుకొని విద్యార్థులకు అండగా నిలబడ్డారు. ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టింగ్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా పోలీసులు ఏకపక్షంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. పోస్టింగ్‌కు సంబంధించి ఆధారాలను చూపెట్టాలని కోరితే మీకు చూపేదేంటి అంటూ పోలీసులు ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి విద్యార్థులను విడిచిపెట్టారు. 

మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తాం..
అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో విచారణ సందర్భంగా పోలీసులు ఎవరికి వారు మిమ్మల్ని ఇరికిస్తాం అంటూ భయభ్రాంతులకు గురి చేసిన వైనాన్ని చెప్పుకుని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏ తప్పూ చేయకున్నా అన్యాయంగా కేసులు పెడితే మా భవిష్యత్తు ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను పోలీసు స్టేషన్‌లో ఉంచిన తీరుపై వివరాలు అడిగేందుకు ‘సాక్షి’ అక్కడికి వెళ్లగా.. ట్రైనీ ఎస్సై త్రినాథ్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. అనుమతి లేకుండా స్టేషన్‌ లోపలికి రాకూడదంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. విద్యార్థి జగదీష్‌రెడ్డి ఫొటో తీసిన క్రమంలో సెల్‌ఫోన్‌ లాక్కుని ఫొటో డిలిట్‌ చేయాలని ఒత్తిడి చేశారు. సాక్షి మీడియాని ఎవరు పిలిచారంటూ విద్యార్థులు, వారి బంధువులపై చిందులు తొక్కారు. ట్రైనీ ఎస్సై వ్యవహరించిన తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top