
పిడుగుల బీభత్సం
మాడుగుల, చోడవరం, పాడేరు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం పడింది...
- అర్లెలో మహిళ మృతి
- చింతలూరులో రెండు గేదెలు..
- చీడికాడలో ఆవు, దూడ
- పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
- చోడవరం, మాడుగుల, పాడేరుల్లో భారీ వర్షం
చోడవరం/మాడుగుల: మాడుగుల, చోడవరం, పాడేరు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. సమారు 30 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. పెద్ద పెద్ద శబ్ధాలతో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. పిడుగుల ధాటికి మాడుగుల నియోజకవర్గం పరిధిలో ఒక మహిళ, రెండు గేదెలు, ఆవు, దూడ దుర్మరణం చెందాయి. గాలులకు చెట్ల కొమ్మలు తీగలపై పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాడుగుల మండలంలోని వివిధ గ్రామాల్లో చీకడి అలుముకుంది. మరి కొన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.
ఎయిర్‌టెల్ నెట్ వర్క పూర్తిగా నిలిచిపోయింది.సెల్ సిగ్రల్ లేక వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. చింతలూరులో పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఏడువాక గణేష్ వర్షం పడుతోందని బయట ఉన్న రెండు గేదెలను పాకలోకి చేర్చాడు. మరో రెండింటిని తీసుకురావడానికి వెళుతుండగా వాటిపై పిడుగు పడింది. అవి అక్కడికక్కడే చనిపోయాయి. గణేష్ స్పృహతప్పి పడిపోయాడు. ఇంటికి తీసకొచ్చి సపర్యలు చేపట్టడంతో కోలుకున్నాడు. చోడవరం, కె.కోటపాడు, దేవరాపల్లి ,బుచ్చయ్యపేట, చీడికాడ, మాడుగుల ,రావికమతం మండలాలతో పాటు పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. బుచ్చెయ్యపేట , చోడవరం మండలాల్లో పలుచోట్ల పిడుగులు పడినప్పటికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
పిడుగుపడి మహిళ మృతి
కె.కోటపాడు: మండలంలోని ఆర్లె గ్రామానికి చెందిన నంబారు పెంటమ్మ(57) పిడుగుపాటుకు శుక్రవారం మృతిచెందింది. పొలానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ఆమె సమీపమలో పిడుగు పడి చనిపోయింది. మండలమంతటా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి.
ఆవు,దూడ మృతి
చీడికాడః మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. పిడుగులకు చీడికాడలో ఒక ఆవు,ఒక దూడ మృతి చెందాయి. ఈ ప్రమాదం నుంచి రెప్పపాటులో ఓ రైతు బయట పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోతల చిన్నంనాయుడు కల్లంలో ఆవు,దూడ,మరో గెదే సమీపంలోని చింత చె ట్టుకు కట్టేసి ఉన్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. పశువులు తడిసిపోతున్నాయని చిన్నంనాయుడు వదిన కొడుకు తురువోలుకు చె ందిన పాత్రిని సన్యాసినాయుడు తొలుత గేదెను పశువుల పాకలో కట్టాడు. ఆవు, దూడ దగ్గరకు వెళుతుండగా చింత చెట్లుపై పెద్ద శబ్ధంతో పిడుగుపడింది. క్షణంలో అవి గింజుకుంటూ చనిపోయాయి. మరో ఐదు అడుగుల వెసివుంటే సన్యాసినాయుడు పిడుగుపాటుకు గురయ్యేవాడు. సంఘటన స్థలాన్ని చీడికాడ పశువైద్యాధికారి భాస్కరరావు పరిశీలించారు.