మనసున్న మహిళకు డీజీపీ అభినందనలు

Gautam Sawang Saluted To Women Who Serve Cold Drinks For Police - Sakshi

సాక్షి, అమరావతి : ఓ మంచి పని చేస్తే సమాజం గుర్తిస్తుంది. ఇప్పుడు విశాఖ జిల్లాలో ఓ మహిళకు అలాంటి గౌరవం దక్కింది. లాక్‌డౌన్‌ వేళ ఏపీలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మూడు రోజుల క్రితం కూల్‌డ్రింక్స్‌ అందించిన మహిళను తాజాగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. వివరాళ్లోకి వెళితే.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విశాఖ తూర్పుగోదావరి సరిహద్దులో గత కొన్ని వారాలుగా పోలీస్ చెక్ పోస్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారు. అయితే అటుగా వెళ్తున్న లోకమణి అనే మహిళ.. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు 2 కూల్ డ్రింక్ బాటిల్స్ అందించింది. ఎందుకు ఇస్తున్నారని అక్కడున్న ఇన్స్‌ప్టెక్టర్‌ ప్రశ్నించగా మీరు చేస్తున్న పనికి మా వంతు సహాయం సార్‌ అంటూ నవ్వింది. దీంతో ఊహించని అభిమానానికి ఆ పోలీసు అధికారి సంతోషంతో అమ్మ నీ నెల జీతం ఎంత. మాకు కూల్‌డ్రింక్‌లు ఇస్తున్నావు అని అన్నారు. (వైరల్‌ వీడియో: చిన్న జీతం.. పెద్ద మనసు)

దానికి మహిళ స్పందిస్తూ.. ఓ స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నానని.. నెలకు 3500 రూపాయల వేతనం వస్తుందని చెప్పింది. దీంతో తక్కువ వేతనంతో జీవితం గడుపుతూ ఎంతో పెద్ద మనసుతో పోలీసులకు కూల్‌డ్రింక్‌ ఇస్తున్నారంటూ ఆమెను పోలీసులు అభినందించారు. అలాగే  రెండు కూల్‌డ్రింక్‌లు ఆమెకిచ్చి పిల్లలకు ఇవ్వమని పోలీసు అధికారులు సూచించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అందరూ లోకమణిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్తా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వీడియోకాల్ ద్వారా ఆమెను అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసులకు కూల్‌డ్రింక్స్‌ ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు చేసిన మంచి పనికి మేము దండం పెడుతున్నాం. మీ అమ్మతనం చూసి చలించిపోయాము. మీకు సెల్యూట్‌ చేస్తున్నాం. అంటూ లోకమణిని డీజీపీ ప్రశంసించారు. (మే 4 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top