కోతలపై ఆగ్రహం | farmers Concerns on power cut | Sakshi
Sakshi News home page

కోతలపై ఆగ్రహం

Jan 26 2014 1:48 AM | Updated on Jun 4 2019 5:04 PM

మండలంలోని తొగిట సబ్‌స్టేషన్ ఎదుట చౌట్లపల్లి, హవేళిఘనపూర్ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ కోతలపై సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను ప్రశ్నించారు.

 మెదక్ రూరల్:  మండలంలోని తొగిట సబ్‌స్టేషన్ ఎదుట చౌట్లపల్లి, హవేళిఘనపూర్ గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ కోతలపై సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను ప్రశ్నించారు. పైనుంచి సరఫరా కావడం లేదని ఆపరేటర్ బదులిచ్చాడు. ఆగ్రహానికి లోనైన రైతులు ఆపరేటర్, వాచ్‌మన్‌ను లోపలే ఉంచి సబ్‌స్టేషన్ గేటుకు తాళం వేశారు. బయటకు రావద్దని వారిని హెచ్చరిస్తూనే గేటుకు ఓ పాత చెప్పును కట్టి అక్కడే గంట సేపు బైఠాయించారు.

 అధికారులు రాకపోవడంతో రైతులు మెదక్-బోధన్ ప్రధాన రహదారి హవేళిఘనపూర్ చౌరస్తాలో గంటకుపైగా రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న విద్యార్థులు,  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో ప్రయాణికులు ఆందోళనకారులతో గొడవకు దిగారు. సమస్య ఉంటే సంబంధిత కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలని, రోడ్డుపై కూర్చుంటే అందరికి ఇబ్బందులు తలెత్తుతాయంటూ వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంబంధిత  ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు.

 ఐదుగంటలు కూడా ఇస్తలేరు..
 ఏడు గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా కనీసం ఐదు గంటలు కూడా రావడం లేదని చౌట్లపల్లి, హవేళిఘనపూర్ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ఐదుగంటల విద్యుత్ సరఫరాలో కూడా మూడు, నాలుగుసార్లు ట్రిప్పు అవుతుందన్నారు. దీంతో పారిన మడులే పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారులతో మొరపెట్టుకున్నా  ఫలితం లేకుండా పోతుందన్నారు.

 కరెంట్ ఇవ్వలేమని ముందే చెబితే వ్యవసాయాన్ని వదులుకునే వారిమని వారన్నారు. రైతుల ఉసురు ముట్టి కాంగ్రెస్ పార్టీ మట్టి కరుచుకపోవడం ఖాయమని పలువురు శాపనార్థాలు పెట్టారు. ఈ ఆందోళనలో చౌట్లపల్లి, హవేళిఘనపూర్ గ్రామాలకు చెందిన రైతులతోపాటు పలు పార్టీలకు చెందిన నాయకులు సాయిలు, శ్రీకాంత్, రాజిరెడ్డి, నవీన్‌రెడ్డి, గణపతి తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement