ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం | Elections ready for arrangements | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం

Feb 26 2014 1:58 AM | Updated on Aug 24 2018 2:33 PM

వచ్చే నెల తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటనతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

సాక్షి, గుంటూరు :వచ్చే నెల తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రకటనతో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టరు క్షేత్ర స్థాయిలో సర్వం సిద్ధం చేసేందుకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే ఎన్నికల బదిలీలు  దాదాపు పూర్తయ్యాయి. ఆయా నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన డిప్యూటీ కలెక్టర్లు శనివారంతో తమ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన డిప్యూటీ కలెక్టర్లు విధుల్లో చేరారు. ఈ దఫా ఎన్నికల్లో పూర్తి స్థాయి నిఘా, అభ్యర్థుల ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఐదు విభాగాలుగా బృందాలు పనిచేయనున్నాయి. ప్రతిసారి ఎన్నికల్లో ముఖ్య విధుల్లో పాలు పంచుకునే అధికారి వివరాలు మాత్రమే సేకరించే వారు. ఈ సారి ఎన్నికల విధుల్లో పాల్గొనే హోం గార్డుల నుంచి ఫొటో, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు, క్లాస్-4 ఉద్యోగుల వివరాలన్నింటినీ సేకరించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు ఆయా శాఖల బాధ్యులకు తమ శాఖల్లోని ఉద్యోగుల వివరాలన్ని అందించాలని కోరనున్నారు.
 
 పోలింగ్ కేంద్రాలపై ఫిర్యాదు లేకుండా పరిశీలన
 జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో ఇప్పటికే 3,739 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో.. రాజకీయ పార్టీలకు సాఫ్ట్ కాపీ అందించారు. ఈ పోలింగ్ బూత్‌లలో సమస్యాత్మకం (సెన్సిటివ్), అత్యంత సమస్యాత్మకం (హైపర్ సెన్సిటివ్) గల వాటిని గుర్తించి ఓ నివేదిక సిద్ధం చేశారు. అవసరమైతే ఈ బూత్‌లకు సహాయంగా మరికొన్ని (ఆగ్జిలరీ బూత్‌లు) ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నారు. పోలింగ్ బూత్‌లను మరోసారి పరిశీలించాలని, అధికారులు పరిశీలనకు వెళ్ళేటప్పుడు స్థానిక రాజకీయ పార్టీల నాయకులతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ బూత్‌ల మార్పు, అధికారుల పరిశీలనకు వచ్చిన అంశాలన్నింటినీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెబ్‌సైట్‌లో ఉంచాలని, ఇందుకు ఆయా నియోజకవర్గాల వారీగా పాస్‌వర్డ్‌లు ఇచ్చారు. పోలింగ్ బూత్‌లపై ఏ సమస్య లేకుండా చూడాలని, రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. 
 
 ఐదు ఎంసీసీ బృందాలు.. ఎన్నికల ప్రవర్తన నియమావళి పర్యవేక్షణకు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు సంబంధించి పరిశీలనకు నియోజకవర్గానికి ఐదు ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) బృందాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందంలో ఓ అబ్జర్వర్‌తో పాటు క్లరికల్ కేటగిరీలో ఇన్‌కంట్యాక్స్, కమర్షియల్, కోపరేటివ్ శాఖల నుంచి ఉద్యోగుల్ని తీసుకోనున్నారు. వీడియో సర్వేలెన్స్ టీంలు, వీడియో వ్యూయింగ్ టీంలు ఏర్పాటు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారి ప్రత్యేకంగా అభ్యర్థి ఖర్చులను పరిశీలించేందుకు వీలుగా షాడో అకౌంట్ నిర్వహించనున్నారు. ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు నియోజకవర్గానికి మూడు బృందాల్ని ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఎన్నికల విధులకు 1,598 మంది వివిధ హోదాల్లో అధికారులు పనిచేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం వారం రోజుల్లో పూర్తి చేసి ఎన్నికలకు అధికారుల్ని సిద్ధం చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement