సద్దుమణిగింది..

Election Campaign Stopped - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి:  ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు ప్రజల మధ్యనే ఉన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘకాలం నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్ర జిల్లాలో 412 కిలోమీటర్ల మేర 232 గ్రామాల మీదుగా సాగింది. ఆ పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమై, వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. పాదయాత్ర జరగని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. జిల్లా నుంచే ఎన్నికల ప్రచారానికి జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.

తొలుత కాకినాడ రూరల్‌ పరిధిలో బూత్‌ కమిటీలతో జరిగిన సమావేశంతో ప్రచార నగరా మోగించారు. తర్వాత పి.గన్నవరం, పిఠాపురం, ముమ్మిడివరం, మండపేట, పెద్దాపురం, రాజానగరం, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు విజయమ్మ ప్రత్తిపాడు, జగ్గంపేటలో, ఇంకోవైపు జగన్‌ సోదరి షర్మిల కొత్తపేట, రాజోలు, రామచంద్రపురం, కాకినాడ సిటీ, రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. సినీ నటులు జయసుధ, అలీ, పృథ్వీ తదితరులు కూడా వైఎస్సార్‌ సీపీ తరఫున ప్రచారం నిర్వహించారు.

వైఎస్‌ జగన్, విజయమ్మ, షర్మిల తమ ప్రసంగాల్లో స్థానిక సమస్యలపై గళమెత్తడమే కాకుండా అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో స్పష్టంగా వివరించారు. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ఎలా మోసం చేశారో తెలియజేస్తూ ప్రజల్ని ఆలోచింపజేశారు. అన్ని సభలకూ జనం పోటెత్తడంతో ఆ పార్టీ శ్రేణులు ఎన్నికల సమరాంగణాన ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించారు. అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోయినప్పటికీ ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలకే ఆయన ఎక్కువ సమయం కేటాయించారు. చేసిన పనులను చెప్పకుండా వైఎస్సార్‌ సీపీపై విషం చిమ్మారు. ఇంకోవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆయన ప్రచారంలో ఎక్కువసేపు జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. దీంతో ప్రజల్ని ఆకట్టుకోలేకపోయారు.

ఎత్తుకు పైఎత్తుల్లో నిమగ్నం
ప్రచారం ముగిసింది. ఇన్ని రోజుల కష్టం సఫలం కావాలంటే ఉన్న కొద్ది సమయమే కీలకం. దీంతో చివరి ఘట్టాన్ని ఎలా అధిగమించాలి, విజయం ఎలా సాధించాలన్న దానిపైనే ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి. అభ్యర్థులు తమ నేతలతో కలిసి సమాలోచనలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను ఎలా చిత్తు చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు పథక రచనలు చేస్తున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా చేయాలన్న దానిపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. అనుకూల ఓటింగ్‌ కోసం మంతనాలు జరుపుతున్నారు. అటు అధికారులు కూడా ఎన్నికల సన్నాహాల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు.

జిల్లాలో అసెంబ్లీ స్థానాలు     : 19
పార్లమెంట్‌ స్థానాలు     :   3
అసెంబ్లీ స్థానాలకు బరిలో ఉన్న అభ్యర్థులు     : 223
లోక్‌సభ బరిలో ఉన్న అభ్యర్థులు     : 36

మొత్తం ఓటర్లు     : 42,04,436
మహిళలు     :     21,23,332
పురుషులు     :   20,80,751
ఇతరులు     :     353
పోలింగ్‌ సమాచారం
పోలింగ్‌ బూత్‌లు      : 4,581
పోలింగ్‌ సిబ్బంది     : 33,040
పీఓలు     :   5039
ఏపీఓలు     : 5039
సిబ్బంది     : 20,156
మైక్రో అబ్జర్వర్లు     : 1580
సెక్టార్స్‌     :  377
రూట్లు      : 443
సెక్టోరల్‌ ఆఫీసర్స్‌    : 406
ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌     : 95
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు     : 1437

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top