‘సచివాలయ’ పంపిణీ ఇలా.. | distribution of employees in Secretariat both states | Sakshi
Sakshi News home page

‘సచివాలయ’ పంపిణీ ఇలా..

Apr 16 2014 2:13 AM | Updated on Nov 9 2018 5:41 PM

రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో సహాయ నుంచి అదనపు కార్యదర్శులు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కసరత్తును పూర్తి చేసింది.

* అత్యధికంగా సీమాంధ్ర వారే సహాయ, ఉప కార్యదర్శులు
* డిప్యుటేషన్‌పై ఇరు రాష్ట్రాలకు సర్దుబాటు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో సహాయ నుంచి అదనపు కార్యదర్శులు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కసరత్తును పూర్తి చేసింది. ఉద్యోగుల పంపిణీ జిల్లాల నిష్పత్తి ప్రకారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న సహాయ నుంచి అదనపు కార్యదర్శుల పోస్టుల్లో ఏ ప్రాంతం వారు ఎంత మంది ఉన్నారు, కేడర్ సంఖ్య ఎంత అనే  వివరాలను అధికారులు సేకరించారు.
 
  ప్రాంతాల వారీగా చూస్తే ప్రధానంగా సహాయ, ఉప కార్యదర్శుల్లో అత్యధికంగా సీమాంధ్ర జిల్లాలకు చెందినవారే ఉన్నారు. ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తే పైన పేర్కొన్న పోస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి కొరత ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు తొలుత మంజూరైన పోస్టులను జిల్లాల నిష్పత్తి మేరకు రెండు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఆ తరువాత కొరత ఉన్న రాష్ట్రానికి పక్క రాష్ట్రం నుంచి డిప్యుటేషన్‌పై నియమించనున్నారు.
 
  సచివాలయంలో మంజూరైన సహాయ కార్యదర్శులు పోస్టుల సంఖ్య 161 కాగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 108 మంది ఉండగా తెలంగాణకు చెందిన వారు 41 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిని జిల్లాల నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తే సహాయ కార్యదర్శుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 84 మంది, తెలంగాణకు 64 మంది రానున్నారు.
  ఉప కార్యదర్శుల పోస్టుల సంఖ్య 60 కాగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 45 మంది, తెలంగాణకు చెందినవారు 15 మంది పనిచేస్తున్నారు. వీరు 20 మంది ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు 16 మంది రానున్నారు.
  సంయుక్త కార్యదర్శుల పోస్టు సంఖ్య 20 కాగా అందులో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు నలుగురు తెలంగాణకు చెందిన వారు పనిచేస్తున్నారు. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు పది, తెలంగాణకు ఏడు పోస్టులు రానున్నాయి.
  అదనపు కార్యదర్శుల పోస్టుల సంఖ్య ఏడు కాగా అందులో ముగ్గురేసి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందినవారు పనిచేస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇద్దరేసి చొప్పున రానున్నారు. ఇందుకు సంబంధించి పంపిణీ ప్రతిపాదనలను త్వరలోనే గవర్నర్ నర్సింహన్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది.

Advertisement
 
Advertisement
Advertisement