ఈ ఉద్యోగం చేయలేను.. తనువు చాలిస్తున్నా.. | Village Revenue officer has died by suicide in Kurnool | Sakshi
Sakshi News home page

ఈ ఉద్యోగం చేయలేను.. తనువు చాలిస్తున్నా..

Jun 7 2026 4:52 AM | Updated on Jun 7 2026 4:52 AM

Village Revenue officer has died by suicide in Kurnool

వీఆర్వో హుసేన్‌ (ఫైల్‌), మృతదేహంతో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులు

పని ఒత్తిడితో కర్నూలులో సచివాలయ వీఆర్వో ఆత్మహత్య  

ఆరోగ్యం బాగోలేదు.. బీఎల్‌ఓ విధుల నుంచి తప్పించాలని కోరా.. 

నా బాధను అధికారులు పట్టించుకోలేదు   

కర్నూలు అర్బన్‌ తహసీల్దార్, ఎలెక్షన్‌ డీటీ నా చావుకు కారణం 

సూసైడ్‌ నోట్‌లో వీఆర్వో ఆవేదన

కర్నూలు(సెంట్రల్‌): ‘అనారోగ్యం అని చెప్పినా వినిపించుకోకుండా విధులు నిర్వర్తించాల్సిందేనంటూ అధికారులు ఆదేశించారు. ఈ మానసిక ఒత్తిడిని భరించలేను..’అంటూ కర్నూలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 28వ వార్డు రెవెన్యూ సెక్రటరీ (వీఆర్వో) ఎస్‌ఎండీ  షేక్‌ మహమ్మద్‌ హుసేన్‌ (45) శనివారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు అర్బర్‌ తహసీల్దార్‌ డి.రవికుమార్, ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ) ధనుంజయలే తన ఆత్మహత్యకు కారణమంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.  

డిస్క్‌ ఆపరేషన్‌.. అయినా తప్పని పనిభారం  
సిబ్బంది కొరత కారణంగా 30, 31వ వార్డు సచివాలయ బాధ్యతలను కూడా హుస్సేన్‌కు అప్పగించారు. అంతేకాక స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో 37వ వార్డు బీఎల్‌ఓ విధులను కూడా కేటాయించారు. దీనికి తోడు తన వార్డుల పరిధిలో జనగణన విధులు ఉంటాయి. అదనంగా సచివాలయ ఉద్యోగులు సాధారణంగా చేసే దాదాపు 25 రకాల సర్వేలు సరేసరి. ఇక జూన్‌ 15 నుంచి ఎస్‌ఐఆర్‌ పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ విధుల్లో భాగంగా ఇంటింటి సర్వే చేయాలి.

ఇంత పనిభారం నేపథ్యంలో మూడు నెలల క్రితం హుస్సేన్‌ సెలవు పెట్టి నడుము నొప్పి కారణంగా ఆపరేషన్‌ చేయించుకున్నాడు. కోలుకుని ఇటీవలే విధుల్లో చేరాడు. ఈనేపథ్యంలో బీఎల్‌ఓ విధులు నిర్వర్తిస్తే క్షేత్రస్థాయిలో తిరిగే సమయంలో నొప్పి వస్తుందని భావించి విషయాన్ని తహసీల్దార్‌ డి.రవికుమార్, ఎలక్షన్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ధనుంజయ్‌కు తెలియజేశాడు. ఆ విధుల నుంచి తప్పించాలని కోరాడు. అయితే వారు అవేమీ పట్టించుకోకుండా విధులు నిర్వర్తించాల్సిందేనని ఆదేశించడంతో ఉద్యోగంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.  

మృతదేహంతో కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉద్యోగులు 
హుస్సేన్‌ మరణ వార్త సచివాలయ ఉద్యోగులను తీవ్రంగా కలచివేసింది. తోటి మిత్రుడు పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10గంటలకే కలెక్టరేట్‌ చేరుకుని హుస్సేన్‌ మృతదేహాన్ని గాంధీ విగ్రహం ఎదుట ఉంచి  ‘ఇది ప్రభుత్వ హత్యే’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది ఒక్క హుస్సేన్‌ సమస్య మాత్రమే కాదని, తమ అందరికీ పని ఒత్తిడి ఉందని ఆవేదన వెలిబుచ్చారు. కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు సచివాలయ ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీసీ, వీసీల్లో అందరి ముందే పురోగతి లేదని అవమానిస్తున్నారని, తాము చెప్పేది ఏ మాత్రం వినడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పని ఒత్తిడికి కారణమవుతున్న ఆయనను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. హుస్సేన్‌ మరణానికి కలెక్టరే బయటకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అయితే ఆమె బయటకు రాకుండా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను పంపారు.

ఆమె వచ్చి హుసేన్‌ భార్య షేక్‌ ఖాజాబీ, కుమారులు షేక్‌ మౌలాలి, షేక్‌ ఖాజా, కూతూరు షేక్‌ సానతోపాటు కొందరు సచివాలయ ఉద్యోగులను వెంట బెట్టుకుని కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్‌ స్పందించి హుస్సేన్‌ కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ.50 వేలతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.  ఈ ఆందోళన కారణంగా ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2.30 గంటల వరకు  కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.  
కుటుంబ సభ్యుల వేధింపులే కారణం: కలెక్టర్‌ 
హుస్సేన్‌ ఆత్మహత్యకు పని ఒత్తిడి కారణం కాదని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి పేర్కొనడం గమనార్హం. అతని మానసిక స్థితి సరిగా లేదని కలెక్టర్‌ పేర్కొన్నారు. భార్య, పిల్లలే హుస్సేన్‌ను కొట్టేవారని, కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటే.. ఎందరు ఉద్యోగులు మిగులుతారని ఆమె ఎదురు ప్రశి్నంచారు. సూసైడ్‌నోట్‌ నిజానిజాలపై విచారణ జరిపిస్తామని కూడా ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement