బీ‘టెక్‌’ చోరుడు! | Engineering student held for multiple burglaries targeting secretariats: ap | Sakshi
Sakshi News home page

బీ‘టెక్‌’ చోరుడు!

May 12 2026 6:15 AM | Updated on May 12 2026 6:15 AM

Engineering student held for multiple burglaries targeting secretariats: ap

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ తుషార్‌ డూడీ

సచివాలయాల్లో ప్రింటర్లు చోరీ.. ఓఎల్‌ఎక్స్‌లో విక్రయాలు 

క్రికెట్‌ బెట్టింగుల కోసం అప్పులు చేసి.. తీర్చడానికి చోరీలు 

30 ప్రింటర్లు.. 3 ల్యాప్‌టాప్‌లు.. స్కూటర్‌ స్వాదీనం 

చిత్తూరు అర్బన్‌: మహేష్ బాబు బీటెక్‌. వయసు 22. బెట్టింగుల వ్యసనం అతడిని చోర శిఖామణిగా మార్చేసింది. పగలంతా కళాశాలకు వెళ్లి చదువుకోవడం.. రాత్రివేళ చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్న అతగాడు చివరకు పోలీసులకు చిక్కాడు. చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఆర్‌ పురం మండలం కన్యకాపురానికి చెందిన మహేష్ బాబు తిరుపతిలో ఉంటూ అక్కడే ఓ కళాశాలలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. క్రికెట్‌ బెట్టింగుల ఉచ్చులో చిక్కుకున్న అతడు తెలిసినవాళ్లు, స్నేహితుల నుంచి అప్పులు తీసుకుని మరీ రూ.లక్షలు పోగొట్టుకున్నాడు.

అయినా ఆ వ్యసనం నుంచి బయటకు రాలేకపోయాడు. పందేలు కాయడానికి డబ్బులు లేకపోవడంతో చివరకు దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీలు చేస్తే పెద్దగా పట్టించుకునే వ్యవస్థ లేదని గ్రహించి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నాడు. రాత్రివేళ సచివాలయాల్లోకి ప్రవేశించి ప్రింటర్లు, ఎల్రక్టానిక్‌ వస్తువులు చోరీ చేసేవాడు. ఇలా ఎస్‌ఆర్‌ పురంలో 5, వెదురుకుప్పంలో 3, గుడిపాలలో 2, జీడీ నెల్లూరులో 2, తిరుపతి జిల్లాలో 5, అన్నమయ్య జిల్లాలో ఒక కేసులో మొత్తం కలిపి 18 కేసుల్లో మహేష్ కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. చోరీ చేసిన వస్తువులను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు అమ్మేసేవాడు. 

వేలిముద్రలే పట్టించాయి 
చోరీలకు పాల్పడిన ప్రాంతాల్లో నిందితుడి వేలిముద్రలను సేకరించిన పోలీసులు ఆధార్‌ కార్డు నమోదైన వేలి ముద్రలతో సరిపోల్చి నిందితుడిని గుర్తించారు. సోమవారం చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై మఠం క్రాస్‌ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహేష్ బాబును అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.8.10 లక్షల విలువ చేసే ప్రింటర్లు, ద్విచక్ర వాహనం, ఇనుప తలుపులు కత్తిరించే భారీ కట్టర్, ల్యాప్‌టాప్‌లను స్వాదీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపించిన కార్వేటి నగరం సీఐ హనుమంతప్ప, ఎస్‌ఆర్‌ పురం ఎస్‌ఐ సుమన్, సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డు అందచేశారు. ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్‌ తరుణ్‌ పహ్వా, ఏఎస్పీ రాజశేఖర్‌ రాజు, నగరి ఇన్‌చార్జి పోలీసు అధికారి రాంబాబు, ఎస్‌బీ సీఐ మురళి ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement