అవినీతిలో అ‘ధర’హో! | Andhra Pradesh Secretariat cost stands at Rs 18413 per sq: Chandrababu govt hiked Cost in AP Secretariat Construction | Sakshi
Sakshi News home page

అవినీతిలో అ‘ధర’హో!

May 2 2026 4:49 AM | Updated on May 2 2026 4:50 AM

Andhra Pradesh Secretariat cost stands at Rs 18413 per sq: Chandrababu govt hiked Cost in AP Secretariat Construction

విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం ఒక్క చదరపు అడుగు రూ.18,413

టవర్లకు అద్దాలు అమర్చేందుకు రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతులు

వాటికి మూడు ప్యాకేజీల కింద టెండర్లు

ఫలితంగా రూ.9,612.85 కోట్లకు చేరుకున్ననిర్మాణ వ్యయం

2018లో ఐదు టవర్ల నిర్మాణ పనులకు మూడు ప్యాకేజీల కింద టెండర్లు

చ.అ రూ.4,350.42 చొప్పున షాపూర్‌జీ పల్లోంజీ,ఎన్‌సీసీ, ఎల్‌ అండ్‌ టీకి పనులు అప్పగింత

2024లో ఆ కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం

భారీగా పెంచిన కొత్త రేట్లతో అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ఎత్తుగడ

నాటికీ నేటికీ స్టీల్, సిమెంటు ధరల్లో పెద్ద వ్యతాస్యం లేదు.. ఇసుక ఉచితం

కానీ అంచనా వ్యయం భారీగా పెంచేసి పాత సంస్థలకే పనుల అప్పగింత

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ఫైవ్‌ స్టార్‌ వసతులతో చదరపు అడుగు రూ.4000–4,500

భారీ ముడుపుల కోసమే అంచనా వ్యయం పెంచేశారంటున్న నిపుణులు

అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి దోచుకుంటున్న వైనం

రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దోపిడీకి సరికొత్త దారులు వెతుకుతోంది.. పూటకో నిర్ణయంతో రాజధాని నిర్మాణ వ్యయాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ఇష్టారాజ్యంగా పెంచేస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టుకు ఇచ్చిన పనిని మళ్లీ ముక్కలు ముక్కలుగా చేసి అదనంగా దోచి పెడుతోంది.. ప్రజల సొమ్మును అందినకాడికి దండుకోడానికి ఇంతగా బరితెగించడం నిర్మాణ రంగ నిపుణులను విస్మయ పరుస్తోంది.. ఇంతటి అవినీతి బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదని అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి.

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయాన్ని చంద్రబాబు సర్కార్‌ మళ్లీ పెంచేసి సరికొత్త రికార్డు సృష్టించింది. డయాగ్రిడ్‌ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్‌కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్‌ క్లాడింగ్, స్కైలైట్‌), ఫొటో వోల్టాయిక్‌ సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు, బిల్డింగ్‌ మెయింటెనెన్స్‌ యూనిట్‌ (బీఎంయూ)లు ఏర్పాటు చేసే పనులు చేపట్టేందుకు రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలవడానికి అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏజీఐసీఎల్‌)కు అనుమతి ఇచ్చింది.

దాంతో.. డిజైన్‌లతో కలిపి శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.18,413.68కు చేరిందని స్పష్టమవుతోంది. ఇక అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.20,439.58కు చేరుకుంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలు, ఇటాలియన్‌ మార్బుల్స్‌తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్దతిలో నిర్మించినా.. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం ఇంతింతై.. అన్నట్లుగా నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అప్పులు తెచ్చి.. నీకింత–నాకింత
రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2016లో తాత్కాలిక సచివాల­యం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,350తో మొదలై.. పూర్తయ్యే సరికి రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని లెక్కలు వేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌­డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్య నేత పంచుకుతినేలా కుట్ర పన్నారంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అప్పుడు, ఇప్పుడు అదే కాంట్రాక్టర్‌
శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018­లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్‌ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాలి్సనంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలకు అప్పగిస్తూ నాడు ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఈ భవనాలకు హై సైడ్‌ ఎలక్ట్రికల్‌ (విద్యుత్‌ సరఫరా), హెచ్‌వీఏసీ (వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్‌ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది.

దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. టవర్ల డిజైన్‌ల పనులను రూ.401.54 కోట్లకు పోస్టర్‌ పార్టనర్స్‌–హాఫీజ్‌ కాంట్రాక్టర్, జెనిసిస్‌ ప్లానర్స్‌కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది.

గూడుపుఠాణీ కాక మరేంటి?
సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2025లో చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను కూడా బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది.

 1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487.11 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన షాపూర్‌జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏతో షాపూర్‌జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.

3, 4 టవర్ల నిర్మాణ పనులను 4.54 శాతం అధిక ధరకు అంటే రూ.1,303.85 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.55 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏతో ఎల్‌ అండ్‌ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చి­తే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.760.93 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.

జీఏడీ టవర్‌ నిర్మాణ పనులను 4.53 శాతం అధిక ధరకు అంటే రూ.882.47 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1 నిలిచిన ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు సీఆర్‌డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే జీఏడీ టవర్‌ కాంట్రాక్టు వ్యయం రూ.492.01 కోట్లు పెరిగింది.

నాడు, నేడు టెండర్లలో ఒకే కాంట్రాక్టర్‌కు పనులు దక్కాయి. టెండర్లలో గూడుపుఠాణీ జరిగిందనడానికి ఇదే తార్కాణమని ఇంజినీరింగ్‌ నిపుణులు ఆరోపిస్తున్నారు.

అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.17,356.54
అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్‌లో బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్, 3 అంతస్తుల్లో (బీ+జీ+3) 11,21,975 చదరపు అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్‌ను కూడా ఫోస్టర్స్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థే రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్‌లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617.33 కోట్లకు కోట్‌ చేసిన ఎల్‌ అండ్‌ టీ లిమిటెడ్‌ సంస్థ చేజిక్కించుకుంది.

జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్‌ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. ఇటీవల ఈ భవనంలో ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్‌వీ పనులు చేపట్టేందుకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అసెంబ్లీ భవనంలో స్పైర్, పార్కింగ్‌ రింగ్, రింగ్‌ రూఫ్‌ వంటి సివిల్‌ స్ట్రక్చర్‌ పనులు చేపట్టడానికి మరో రూ.798 కోట్లతో అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం రూ.1,947.36 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగు రూ.17,356.54కు చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement