వంట మాస్టార్ల దేవుపల్లి

Devupally Village Is Famous For Cooking Masters - Sakshi

సాక్షి,గజపతినగరం(విజయనగరం) : చుట్టూ పచ్చని పంటలు పండుతుంటే.. ఆ గ్రామంలో ఆకలి కేకలు వినిపించేవి. వర్షాల్లేక పంటలు ఎండిపోయేవి. ఆహారం కోసం జీవితాలు అల్లాడిపోయేవి. అప్పుడే పరిష్కార మార్గం ఆలోచించారు. ఆకలి తీరాలంటే.. ఆకలి తీర్చే ఆహారాన్ని వండటమే వృత్తిగా స్వీకరించారు. శుభకార్యాలకు వంట చేసే పనితో జీవితాలకు బాట వేసుకున్నారు. ఏ ఊళ్లో అయినా ఒకరో.. ఇద్దరో వంట చేసేవారుంటారు.. కానీ అక్షరాలా 250 మంది వంట మాస్టార్లతో ప్రత్యేకతను చాటుకుందా గ్రామం. నల భీముల చిరునామాగా మారిన దేవుపల్లి గ్రామంపై ఆసక్తికరమైన కథనమిది.

చుట్టుపక్కల గ్రామాల్లో పంటలు పండినా.. దేవుపల్లిలో ఏటా పండేవి కావు. గ్రామంలో మెట్టు భూములు మాత్రమే ఉండేవి. ఉన్న కొద్ది మాత్రం పల్లపు భూముల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పండేవి కావు. ఎక్కువ కుటుంబాలు భూముల్లేక వ్యవసాయ పనులపైనే ఆధారపడేవారు. దీంతో ఆకలి మంటను తీర్చుకోవడానికి ఏ మార్గం కనిపించక వంట చేసే వృత్తిని గ్రామస్తులు స్వీకరించారు. అదే ఇప్పుడా గ్రామానికి గుర్తింపు తెచ్చి పెట్టింది. బుర్రకథ కళలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన కుమ్మరి మాస్టారుది కూడా ఈ గ్రామమే కావడం విశేషం.ఈ గ్రామంలో ఏ ఇంటి తలుపు తట్టినా తప్పని సరిగా ఒక వంట మాస్టారు ఉండటం విశేషం.

పాతికేళ్లుగా వంట పనే వృత్తి
దేవుపల్లి గ్రామంలో దాదాపు 3వేల మంది జనాభా ఉంటారు. అందులో 10 శాతం మంది శుభకార్యాలకు వండే పనిలోనే స్థిర పడ్డారంటే ఆ వృత్తిని ఎంతగా వారు గౌరవించి జీవనాధారంగా మలుచుకున్నారో అర్థమవుతుంది. శుభకార్యాల్లో దేవుపల్లి వంట మాస్టర్లు వంట చేశారంటే.. భోజనాలు బాగానే ఉంటాయి.. రుచి విషయంలో చూడాల్సిన అవసరం లేదని అతిథులు భావిస్తారు. ఇప్పడు వారికి ఏటా దాదాపు 200 రోజుల వరకు పని ఉంటోందంటే.. వంట అంత రుచిగా తయారు చేయడమే ప్రధాన కారణం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top