
విజయనగరం: గజపతినగరం పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతుల ఆందోళనకు దిగారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో రైతుల కొట్లాటకు దిగారు. కుర్చీలు విరిగేలా టీడీపీ నేతలు, రైతులు కొట్టుకున్నారు. రైతులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.. లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపై రైతులు తిరగబడ్డారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు పడనిరాని పాట్లు పడుతున్నారు.
అనకాపల్లి: హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో యూరియా కోసం రైతుల పాట్లు పడుతున్నారు. ఎస్. రాయవరం మండలం కొరుప్రోలు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. యూరియా ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్న యూరియా సక్రమంగా పంపిణీ చేయలేదంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా యూరియా అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని రైతులు డిమాండ్ చేశారు.
కాగా, కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత బొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు.
