బైకర్ మద్యం మత్తే కారణం
పూర్తిగా కాలిపోయిన బైక్... వ్యక్తికి గాయాలు
విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఘటన
రామభద్రపురం: కర్నూలు సమీపంలో ఇటీవల జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదం తరహాలోనే విజయనగరం జిల్లా రామభద్రపురం వద్ద బైపాస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి ఓ బైక్‌ను ఢీకొని మినీ లారీ పూర్తిగా కాలిపోయింది. రామభద్రపురం ఎస్‌ఐ వి.ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం... పాచిపెంట మండలం గడివలస గ్రామానికి చెందిన బెవర అప్పలనాయుడు శనివారం అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో మద్యం మత్తులో బైక్‌పై రామభద్రపురం మీదుగా బాడంగి మండలం రౌతువానివలసలోని తన అత్తవారి ఇంటికి వెళుతున్నాడు.
ఒడిశాకు చెందిన మినీ లారీ తుని నుంచి గోనె సంచుల లోడుతో రామభద్రపురం బైపాస్ రోడ్డు మీదుగా ఒడిశా వెళుతోంది. మార్గం మధ్యలో పొట్టవాని కోనేరు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కన పడిపోయిన అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. మినీ లారీ కింద ఇరుక్కుపోయిన బైక్‌ను సుమారు వంద అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. తీవ్ర రాపిడితో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. బైక్, మినీ లారీ కాలిపోయాయి. బాడంగి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


