పైపై పూత..నిధుల మేత!

Delay In Government Schools Devolopment - Sakshi

పాఠశాలల అభివృద్ధి పనుల్లో  నిబంధనలకు తూట్లు

తూతూ మంత్రంగా మరమ్మతులు, పెయింటింగ్‌

కాంట్రాక్టర్లను ప్రశ్నించలేక పోతున్న హెచ్‌ఎంలు

చోద్యంచూస్తున్న ఉన్నతాధికారులు

పాఠశాలలను సరస్వతీ నిలయాలు అంటారు. మరికొందరు దేవాలయాలతో సమానంగా భావిస్తారు.  అలాంటి వాటి   అభివృద్ధి పనుల విషయంలో కాసులకు కక్కుర్తి పడుతున్నారు అధికార పార్టీ నాయకులు. తూతూ మంత్రంగా పనులు చేపట్టి నిధులు మింగేస్తున్నారు.  

బనగానపల్లె :జిల్లాలోని కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉండగా, మరికొన్నింటి గోడలు బీటలు వారి,  బండపరుపు, మెట్లు దెబ్బతిని, రంగులు మసకబారి ఉన్నాయి. ఇలాంటి వాటిని పూర్తిగా మరమ్మతులు చేసి గోడలకు రంగులు వేసేందుకు సర్వశిక్ష అభియాన్‌ శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 377 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలున్నాయి.   వాటిలో చేపట్టాల్సిన పనులను బట్టి ఒక్కోస్కూల్‌కు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మరమ్మతులు పూర్తి చేశాక గోడలకు రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి చదరపు మీటరుకు పెయింటింగ్‌ వేసేందుకు  రూ.124.45,  గోడను నునుపు చేసేందుకు రూ. 6.82  చొప్పున కాంట్రాక్టర్‌కు ఇస్తుంది.

అయితే, ఆయా పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లుల మంజూరుకు   పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో  సంతకం అవసరం. అయితే, ఈనిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఈ పనులను రాష్ట్రమంత్రికి చెందిన సమీప బంధువు దక్కించుకోవడంతో ప్రధానోపాధ్యాయులు ప్రశ్నించలేకపోతున్నారు.  చాలా స్కూళ్లలో పగుళ్లిచ్చిన  చోట మాత్రమే సిమెంట్‌ పూసి వదిలేస్తుండటంతో అవి కొద్దిరోజులకే ఊడిపోతున్నాయి. పెయింటింగ్‌ కూడా తూతూమంత్రంగా వేస్తున్నారు. దీనిపై కొందరు నిలదీసినా కాంట్రాక్టర్లు లెక్క చేయడం లేదని హెచ్‌ఎంలు వాపోతున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు   స్పందించి అభివృద్ధి పనుల తీరుపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.    

పనులు సరిగ్గా చేయడం లేదు  
ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన పెయింటింగ్, ఇతర అభివృద్ధి పనులు నిబంధనల మేర జరగడం లేదు. చేసిన పనులు కొద్ది కాలమైనా గుర్తుండాలి.  ఈ విషయాన్ని సంబంధిత కాంట్రాక్టర్లు గుర్తించాలి.
– గుండం నాగేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత,బనగానపల్లె మండలం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top