కొనసాగుతున్న కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌

CORDON & SEARCH DRIVE : Vehicles, weapons seized - Sakshi

పోలీసుల అదుపులో అనుమానితులు... వేటకొడవళ్లు, కత్తులు స్వాధీనం  

విజిబుల్‌ పోలీసింగ్‌తోనే నేరాలకు అడ్డుకట్ట : ఎస్పీ  

కర్నూలు : జిల్లాలో ఇటీవల వరుస పేలుళ్ల సంఘటన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. సబ్‌ డివిజన్ల వారీగా సమస్యాత్మక ప్రాంతాలే లక్ష్యంగా కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ గోపీనాథ్‌ జట్టి ఆదేశాల మేరకు వారం రోజులుగా ఎంపిక చేసిన సబ్‌ డివిజన్లలోని సమస్యాత్మక ప్రాంతాల్లోని ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు.

 ఇందులో భాగంగా శనివారం తెల్లవారుజామున 4 నుంచి 7 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పలు సమస్యాత్మక, అనుమానిత ప్రాంతాల్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు స్పెషల్‌ పార్టీ సిబ్బందితో కలిసి కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌  నిర్వహించారు.  కర్నూలు డీఎస్పీ యుగంధర్‌ బాబు ఆధ్వర్యంలో మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అరుంధతి నగర్, మదర్‌ల్యాండ్, రాంప్రియ నగర్, సరస్వతి నగర్, ఎల్‌బీజీ నగర్‌ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పలువురు అనుమానితులను విచారించారు. వారి వద్ద ఉన్న వేటకొడవళ్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని ఒక ఐచర్‌ వాహనం, ఒక ఆటో, ఐదు మోటార్‌ సైకిళ్లను సీజ్‌ చేశారు. 

అలాగే నంద్యాలలోని నందమూరి నగర్, ఏఎస్‌ఆర్‌ నగర్‌ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 4 ఆటోలు, 8 మోటార్‌ సైకిళ్లను స్వా«ధీనం చేసుకున్నారు. ఆదోని డీఎస్పీ ఆంకినీడు ప్రసాద్‌ నేతృత్వంలో ఆదోని పట్టణం లేబర్‌ కాలనీ, శంకర్‌ నగర్‌లలో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఓ ఆటో, 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆత్మకూరు, సిద్ధాపురం ప్రాంతాల్లో   పది మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  2500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. విజిబుల్‌ పోలీసింగ్‌తో  ప్రజల్లో భయాన్ని పోగొట్టి  నేరాలను నియంత్రించేందుకు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top