
విమానాశ్రయం (గన్నవరం): న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని ఆదివారం వైజాగ్ మీదుగా మళ్లించేందుకు ఆ సంస్థ అధికారులు చేసిన ప్రయత్నాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు, ఎయిరిండియా ప్రతినిధులకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన ఎ–319 విమానం రోజూ న్యూఢిల్లీ నుంచి ఉదయం 8.15 గంటలకు ఇక్కడికి చేరుకుని 9.05కు తిరిగి ఢిల్లీ వెళ్తుంది. ఆదివారం ఉదయం అరగంట ఆలస్యంగా 9.35కు విమానం ఇక్కడికి చేరుకుని 80 మంది ప్రయాణికులతో తిరిగి వెళ్లేందుకు సిద్ధమైంది.
వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమాన సర్వీస్ సాంకేతిక కారణాలతో రద్దు కావడంతో అక్కడ ఉన్న 40 మంది ప్రయాణికులను కూడా ఇదే విమానంలో పంపించేందుకు నిర్ణయించారు. ఈ విషయమై ప్రయాణికులకు చెప్పగా వారంతా వ్యతిరేకించారు. వైజాగ్ ఆగి వెళ్లడం వల్ల రెండు గంటల సమయం వృథా అవుతుం దని, దీనివల్ల ఇతర దేశాలు వెళ్లేందుకు ముందుగా బుక్ చేసుకున్న విమాన సమయా నికి చేరుకోలేమని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఎయిరిండియా అధికారులు వినకపోవడంతో ఎయిర్‌పోర్ట్, పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగగా, విమానాన్ని నేరుగా ఢిల్లీ పంపించేందుకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వివాదం కారణంగా సుమారు గంట ఆలస్యంగా విమానం ఢిల్లీకి బయలుదేరింది.