ఆర్టీసీ విలీనానికి సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

CM YS Jagan Green Signal For Merging APSRTC In Government - Sakshi

సాక్షి, అమరావతి : ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకారం తెలిపారు. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు అంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నియమించిన కమిటీ.. తన నివేదికను సీఎం జగన్‌కు అందజేసిందన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి ఆమోదించారని మంత్రి నాని స్పష్టం చేశారు. ప్రభుత్వం దీనిపై రేపు నిర్ణయం  తీసుకుంటుందన్నారు. 

ప్రభుత్వంలో కొత్తగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి చెప్పారు. ఆ విభాగంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడం జరుగుతుందన్నారు. మిగిలిన విధి విధానాలన్నీ త్వరలో ఖరారవుతాయన్నారు. దశాబ్దాలుగా ఉద్యోగ భద్రత లేకుండా ఆర్టీసీలో కార్మికులు పనిచేస్తున్నారని, సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కల నెరవేరబోతుందని మంత్రి నాని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆర్టీసీ మీద ఉన్న జీతభత్యాల భారం సుమారు రూ. 3,300 నుంచి రూ. 3,500 కోట్లు ఉందని, దాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకోబోతుందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 

కాగా సీఎం జగన్‌ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మికులు, యూనియన్‌ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకరించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ) నాయకుడు పలిశెట్టి దామోదరరావు(వైవీ రావు) మీడియాతో మాట్లాడుతూ.. ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు అంగీకరించిన సీఎం జగన్‌కు ఈయూ తరపున కృతజ్ఞతలు తెలిపారు. వీలీనం కమిటీకి ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు ఇచ్చిన అన్ని డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కోరుకున్న విధంగా విలీనం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే అన్ని సౌకర్యాలు ఆర్టీసి ఉద్యోగులకు వర్తించేలా చూడాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top