రాజధాని కావాలి...రైతులు బాగుండాలి..కానీ డబ్బుల్లేవు: బాబు

రాజధాని కావాలి...రైతులు బాగుండాలి..కానీ డబ్బుల్లేవు: బాబు - Sakshi


హైదరాబాద్ :  రాష్ట్ర విభజన సమయంలో అన్ని అంశాల్లోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్పై సబ్ కమిటీతో ఆయన శనివారం సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటుపై గడిచిన అయిదు నెలలుగా తాత్కాలిక రాజధాని ఏర్పాటులో సమస్యలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ లో కూర్చొని పని చేయలేమని చంద్రబాబు అన్నారు.గుంటూరు-విజయవాడ ప్రాంతానికి రాజధాని రానీయకుండా కొంతమంది ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల్లో అపోహలు సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలు లేని చోట రాజధాని రాదని ఆయన అన్నారు. రాజధాని కోసం ప్రజలు విరాళాలు ఇస్తున్నారని, ప్రజల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం జరగాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక ఇటుక, దానికి సమానమైన విలువను విరాళంగా ఇవ్వాలని ఆయన కోరారు.రాజధాని వస్తే ఆ ప్రాంతంవారే బాగుపడతారని కొంతమందికి కడుపుమంట ఉందని, రైతులను చాలామంది రెచ్చగొడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సాధారణ సందర్భాల్లో భూసేకరణ చేస్తారని, అయితే తాము సమీకరణకు వెళుతున్నామని చెప్పారు. ప్రజలను చైతన్యవంతులను చేసి భూసమీకరణ చేస్తామని చంద్రబాబు తెలిపారు. పరస్పర ప్రయోజనం ఆధారంగా భూ సమీకరణ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. భావితరాలు గర్వపడేలా ఏపీ రాజధాని ఉంటుందని అన్నారు.రాజధానికి ఎంతభూమి కావాలన్నది భవిష్యత్ నిర్ణయిస్తుందని చంద్రబాబు తెలిపారు. దానిపై తానేమీ మాట్లాడనని ఆయన అన్నారు. ఇప్పుడు రూ.100 కూలి వస్తే భవిష్యత్లో రూ.1000 కూలి వస్తుందని, రైతులు డబ్బు సంపాదించుకోవచ్చని...రాను రాను వారికే తెలివితేటలు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  ఏసీ రూంలో కూర్చుంటే డబ్బు వచ్చే పరిస్థితి వస్తుందని, ఇప్పుడైతే రాత్రి, పగలు బురదలో పిసుక్కోవాలని ఆయన అన్నారు.రైతులకు డబ్బు సంపాదించుకునే ఉపాధి మార్గాలు చూపిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని కావాలి...రైతులు బాగుపడాలి...కానీ డబ్బుల్లేవని ఆయన అన్నారు. ఇళ్లు లేనివారికి శాశ్వత గృహ నిర్మాణం చేపడతామని తెలిపారు. తనవల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఆదాయమే ఇప్పుడు వారికి ఉపయోగపడుతుందని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top