ఇప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు ‘ఢిల్లీ దీక్ష’ మింగుడు పడటంలేదు.
బాబు దీక్ష: 'ఢిల్లీ’కి దూరంగా జిల్లా నేతలు
Oct 11 2013 1:03 AM | Updated on Sep 1 2017 11:31 PM
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు ‘ఢిల్లీ దీక్ష’ మింగుడు పడటంలేదు. జిల్లాలో ఉనికి కోల్పోయిన పార్టీని ప్రస్తుత పరిణామాలు మరింత ఇరకాటంలో నెట్టాయి. పంచాయతీ ఎన్నికల్లో నామమాత్ర ఫలితాలతో సరిపెట్టుకున్న పార్టీ వచ్చే సాధారణ ఎన్నికలపై దింపుడు కళ్లం ఆశతో వుంది. అయితే చంద్రబాబు చేపట్టిన దీక్షతో చివరి ఆశలు కూడా ఆవిరైనట్లేనని తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు మండిపడుతున్నారు. దీంతో నాలుగు రోజులుగా ఏపీ భవన్ వేదికగా పార్టీ అధ్యక్షుడు దీక్ష చేస్తున్నా ఢిల్లీ గుమ్మం తొక్కేందుకు నేతలు వెనుకంజ వేస్తున్నారు. జిల్లా నుంచి పార్టీ ముఖ్య నేతలు ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు ఢిల్లీ గడప తొక్కకపోవడమే నిదర్శనమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రతీ యేడూ మాదిరిగానే ఈసారి కూడా నిజామాబాద్ జిల్లా జన్నపల్లిలో దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రధాన కార్యదర్శి, పటాన్ చెరు కార్పొరేటర్ సపాన్‌దేవ్ కూడా తాను నవరాత్రి పూజల కోసం కంకణ ధారణ చేసినందున ఎక్కడకూ వెళ్లడం లేదని చెప్తున్నారు. మాజీ మంత్రి బాబూ మోహన్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి తదితరులు బాబు దీక్షకు దూరంగా ఉన్నారు. వీరితో పాటు నరోత్తం, బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి తదితర క్రియాశీల నేతలు సొంత పనుల్లో మునిగి తేలుతున్నారు. బాబు దీక్షకు వీలైనంత దూరం పాటించాలన్నదే పార్టీ నేతల మనోగతంగా కనిపిస్తోంది.
దీక్షపై నేతల అనాసక్తి
తెలంగాణ అంశంపై రెండు కళ్ల సిద్ధాంతం అనుసరించిన నాటి నుంచే జిల్లాలో తెలుగుదేశం పార్టీ మనుగడ కోల్పోతూ వచ్చింది. 2009 సాధారణ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన నేతలు కొందరు పార్టీని వీడారు. మరికొందరు పార్టీలోనే ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో స్తబ్దుగా ఉంటున్నారు. ‘అక్కడి ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలంటూ చంద్రబాబు చేస్తున్న దీక్షతో ఇక్కడ పార్టీకి నూకలు చెల్లినట్లే భావిస్తున్నాం. మిగిలిన కొద్దిపాటి కేడర్‌కు కూడా జిల్లాలో దిశా నిర్దేశం చేసే నాయకత్వం కరువైంది. పార్టీ పట్ల నిబద్దత కలిగిన కేడర్ ఎక్కడో ఓ చోట కొంతమేర మిగిలివున్నా, 2014 ఎన్నికల నాటికి మనుగడ సాగించే పరిస్థితి కనిపించడం లేదంటూ’ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వస్తున్న ఓ చోటా నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement