అరకు కాఫీ రుచి అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ కితాబునిచ్చారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా
సాక్షి, విశాఖపట్నం: అరకు కాఫీ రుచి అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ కితాబునిచ్చారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజ్, మారిటైమ్ ఎగ్జిబిషన్‌లను శనివారం ప్రధాని సందర్శించారు. అందులోని స్టాల్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు అరకు కాఫీ విశిష్టతను మోదీకి వివరించారు. కాఫీ రుచి చూసిన ప్రధాని అద్భుతమన్నారు.
ఐఎఫ్‌ఆర్ విలేజ్‌లో హస్తకళలు, చేతివృత్తులకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాళ్లను పరిశీలించి కళాకారులతో ముచ్చటించారు. మారిటైమ్ ఎగ్జిబిషన్‌లో నౌకాదళ ఆయుధ సంపత్తి, వాటికి సంబంధించిన శాస్త్రీయ వివరాలను ప్రధాని తెలుసుకున్నారు. మన శాస్త్ర, సాంకేతిక రంగం చేస్తున్న కృషి, సామర్థ్యం, సిగ్నలింగ్, నావికా స్థావరాలు, అస్త్రాల నమూనాలను అధికారులు మోదీకి వివరించారు. భారత నావికాదళ అధిపతి ఆర్‌కే ధోవన్, తూర్పు నావికాదళ అధిపతి వైస్ అడ్మిరల్ సతీష్‌సోనీ ప్రధాని వెంట ఉన్నారు.