‘బాబు మెయిన్‌ విలన్‌.. పవన్‌ సైడ్‌ విలన్‌’

Ambati Rambabu Fires On Chandrababu And Pawan Over Amaravathi Issue - Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

సాక్షి, తాడేపల్లి : దేశ చిత్ర పటంలో అమరావతి లేకపోవడానికి చంద్రబాబే కారణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని పేరుతో అమరావతిని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం  తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చిరంజీవి అశీస్సులతోనే పవన్‌ కల్యాణ్‌ హీరో అయ్యారని గుర్తుచేశారు. అయితే చిరంజీవి సపోర్ట్‌ లేకపోవడంతో రాజకీయాల్లో హీరో కాలేకపోయారని విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు మెయిన్‌ విలన్‌ అయితే.. పవన్‌ సైడ్‌ విలన్‌ అయ్యారన్నారు. పవన్‌ టీడీపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తునారని ఆరోపించారు. అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

గ్రాఫిక్స్‌తో కాలయాపన చేశారు
‘వరల్డ్‌ లార్జెస్ట్‌ సిటీ అమరావతి అంటూ గ్రాఫిక్స్‌ ఫొటోలు చూపించారు, మన రాష్ట్రంలో చంద్రబాబు చూపించిన ఫొటోలు, బిల్డింగ్‌లు ఎక్కడైనా ఉన్నాయా?. సింగపూర్‌ ఫోటోలో చూపించి ఇదే అమరావతి అన్నారు. కృష్ణానదిపై ఐకాన్‌ బ్రిడ్జి అన్నారు. ఎక్కడైనా కనిపించిందా?. తెలియని వాళ్లు ఈ ఫోటోలు చూసి అమరావతి అద్భుతంగా ఉందనే భ్రమలు కల్పించారు. ఊహా చిత్రాలు, గ్రాఫిక్స్‌తో బాబు కాలయాపన చేశారు. దేశంలో దొరికిన చోటల్లా అమరావతి పేరుతో చంద్రబాబు అప్పులు చేశారు.  రాజధాని పేరుతో రూ.9 వేల కోట్లు చంద్రబాబు వృథా చేశారు.  ప్రజలను ఊహా ప్రపంచంలో తిప్పి సర్వనాశనం చేశారు. స్క్వేర్‌ ఫీట్‌కు రూ.12 వేలు వెచ్చించి తాత్కాలిక సచివాలయం నిర్మించారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించి, అమరావతిని నిర్మిస్తున్నామని గొప్పులు చేప్పి చంద్రబాబు సాధించింది ఏంటి?. 

నోటిఫికేషన్‌ ఇచ్చారా?
రాజధానికి ఐదేళ్లలో నోటిఫికేషన్‌ ఇవ్వలేదు.  అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది, ఏపీకి మాత్రం ఆ పరిస్థితి లేకుండా చంద్రబాబు పాలన సాగించారు. రాజధాని అంతా కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారే తప్ప.. సాధించింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అమరావతిలో ఒక్కటైనా శాశ్వత కట్టడం ఉందా?. రాజధాని పేరుతో రైతులను మోసం చేశారు. కిలోమీటర్‌కు రూ.7 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని చుట్టూ చంద్రబాబు బినామీలు భూములు కొన్నారు.  అమరావతికి శంకుస్థాపన చేసిన తరువాతే టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అమరావతి ఇప్పటికీ పూర్తి కాలేదు కానీ టీడీపీ కార్యాలయ నిర్మాణం పూర్తి కావొస్తుంది.

పెళ్లికి వస్తే విమర్శించకూడదా?
ఇసుకపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. ఈ నెల 14న చంద్రబాబు ఇసుక దీక్ష చేయడం విడ్డూరంగా ఉంది. ఏదో విధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు.  పవన్‌ కళ్యాణ్‌ కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టుకోవాలని, పులివెందులకు దగ్గరగా ఉంటుందని పవన్‌ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. రాంబాబు ఇంటికి పెళ్లికి వెళ్లానని పదే పదే పవన్‌ పేర్కొనడం బాధాకరమన్నారు. అంటే పెళ్లికి వచ్చినంత మాత్రానా రాజకీయంగా విమర్శించకూడదా?. టీడీపీ నేతలు కూడా పెళ్లికి వచ్చారు, వారిని రాజకీయంగా విమర్శించాము. లక్షల పుస్తకాలు చదివిని మేధావి పెళ్లి గురించి మాట్లాడటం సరికాదు. నేను ఫ్యాక్షనిస్టునా? సత్తెనపల్లికి వచ్చి తెలుసుకోవాలి.

బాబు మెయిన్‌ విలన్‌.. పవన్‌ సైడ్‌ విలన్‌
విజయసాయిరెడ్డి గురించి కూడా పవన్‌ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. హద్దు అదుపు లేకుండా పవన్‌ మాట్లాడుతున్నారు.  పవన్‌ చాలా కామెడిగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలకు అర్థంపర్ధం లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములే కొలమానం. రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ సీఎంను విమర్శించడం సరికాదు. ఇప్పటికైనా పవన్‌ ఇలాంటి విధానాలు మానుకోవాలి. పవన్‌ సినిమా హీరో.. చిరంజీవి ఆశీస్సుల వల్ల సినిమాల్లో హిట్‌ అయ్యారు. రాజకీయాల్లో హీరో కాలేకపోయారు, సైడ్‌ విలన్‌ అయ్యారు. మెయిన్‌ విలన్‌ చంద్రబాబు అయితే సైడ్‌ విలన్‌ పవన్‌ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ సంస్కారం నేర్చుకోవాలి’అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top