
స్వేచ్ఛాయుత పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఈనెల 17న జరగనున్న పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి కేవీ సత్యనారాయణ తెలిపారు.
► ఓటు బయటికి తెలిసే ఛాన్సే లేదు
► వెబ్, వీడియో కెమెరాల ఏర్పాటు
► ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక కేంద్ర పరిశీలకుడు
► జిల్లా ఎన్నికల అధికారి కేవీ సత్యనారాయణ
కడప సెవెన్‌రోడ్స్: శాసనమండలి కడపస్థానిక సంస్థల నియోజకవర్గానికి ఈనెల 17న జరగనున్న పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి కేవీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మలమడుగు, రాజంపేటలలో ఆర్డీఓ కార్యాలయాలు, కడపలో జెడ్పీ సమావేశ మందిరం పోలింగ్ కేంద్రాలుగా ఉంటాయన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం సీనియర్ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామన్నారు.
మూడంచెల భద్రత: ఒక్కో పోలింగ్ ప్రాంతాన్ని ఇన్నర్ సర్కిల్, కాంపౌండ్, ఔటర్ సర్కిల్‌గా విభజించామన్నారు. ఓటర్లు తాము ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారానే లోనికి వెళ్లి అనంతరం మరోమార్గం ద్వారా బయటికి రావాల్సి ఉంటుందన్నారు. ఓటర్లు లోనికి వెళ్లే సమయంలో మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఓటు వేసిన అనంతరం బయటికి వచ్చే సమయంలో కూడా తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఓటర్లు తమ వెంట ఐడీ కార్డు, ఓటరు స్లిప్పులు తీసుకొస్తేనే లోనికి అనుమతిస్తామని చెప్పారు.
కెమెరాలతో నిఘా: పోలింగ్ కేంద్రంలో రెండు వెబ్ కెమెరాలతోపాటు ఇద్దరు వీడియో గ్రాఫర్లను సైతం నియమిస్తున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళుతున్నారో ఇట్టే తెలిసిపోతుందన్నారు. కలెక్టరేట్ మీడియా సెంటర్‌లో వెబ్‌కాస్టింగ్‌ను తిలకించవచ్చన్నారు.
రహస్య ఓటింగ్: పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వ్యక్తి ఓటరు అవునో, కాదో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బ్యాలెట్ పేపరు ఇస్తామని తెలిపారు. కంపార్టుమెంటులోకి వెళ్లి ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పత్రం వెనుక ఉన్న పీఓ సంతకం, డిస్టింగ్విషింగ్ మార్క్‌ను ప్రిసైడింగ్ అధికారికి చూపించాల్సి ఉంటుందన్నారు. వీటిని సరిచూశాక ప్రిసైడింగ్ అధికారి అనుమతి మేరకే ఓటరు తన బ్యాలెట్ పత్రాన్ని బాక్సులో వేయాలన్నారు. ఓటింగ్ వంద శాతం రహస్యంగానే సాగుతుందని వివరించారు. ప్రస్తుతం జరిగే పోలింగ్‌లో ఏ ఓటరుకు కంపానియన్ సౌకర్యం ఉండదని స్పష్టం చేశారు.
అడుగడుగునా పోలీసుల మోహరింపు: ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెయ్యి మంది పోలీసులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీరితోపాటు ప్రధాన కూడళ్లు, పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసుల పహారా ఉంటుందన్నారు. సీఆర్‌పీఎఫ్ బలగాలతోపాటు ఆరు ప్లటూన్ల ఏపీఎస్‌పీ బలగాలు, స్థానిక పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు.
ప్రచారాలు బంద్: బుధవారం 4 గంటలకు ప్రచార కార్యక్రమం ముగిసిందని పేర్కొన్నారు. ఎలాంటి ప్రచారాలు నిర్వహించరాదన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి ఆఫీసు బేరర్లు ఎవరూ పోలింగ్ ఏజెంట్లుగా కూర్చొవడానికి అనుమతించబోమని తెలిపారు. రిటర్నింగ్ అధికారి శ్వేత, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వై.నరసింహారావు, ట్రైనీ ఐఎఫ్‌ఎస్ నందిని పాల్గొన్నారు.
ఎన్నికల పరిశీలకులు వీరే..: తొలుత ఎన్నికల సంఘం జిల్లాకు ఒక్క పరిశీలకుడిని మాత్రమే నియమించిందని చెప్పారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితిని చూశాక మరో ఇద్దరు పరిశీలకులు అవసరమని తాము ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. దీంతో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పరిశీలకుని ఈసీ నియమించిందని కలెక్టర్ పేర్కొన్నారు. కడప డివిజన్ పోలింగ్ కేంద్రానికి చక్రవర్తి, రాజంపేటకు కరికల వలవెన్, జమ్మలమడుగుకు కేఎస్ జవహర్‌రెడ్డిలను ఈసీ నియమించిందన్నారు. జనరల్ అబ్జర్వర్‌గా బి.కిశోర్ వ్యవహరిస్తారని వివరించారు. వీరితోపాటు అమిత్‌గార్గ్ అనే ఐపీఎస్ అధికారి పోలీసు అబ్జర్వర్‌గా ఉంటారని తెలిపారు.