విజయవాడలో విహంగ విందు

Aeroplane Restaurant Was Starting In Vijayawada - Sakshi

ఆకాశంలో విమానాన్ని చూస్తూ కలల్లో విహరించే రోజులు పోయాయి. లోహ విహంగాల్లోనే చక్కర్లు కొట్టే రోజులు వచ్చేశాయి. పెరిగిన ఆర్థిక స్థితిగతులు, విమానయాన సంస్థల మధ్య పోటీతో మొదటి తరగతి రైలు ప్రయాణ చార్జీలతోనే విమానాల్లో దేశీయంగా ప్రయాణం చేసేయవచ్చు. అయితే విమానాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం, పిల్లలతో కలిసి గేమ్స్‌ ఆడుకోవడం ఇవన్నీ సాధ్యమేనంటారా... అంటే సాధ్యమేనంటున్నారు విజయవాడ ట్రేడ్‌ వర్గాలు.. నగరవాసులకు అతి త్వరలో విమాన రెస్టారెంట్‌ అందుబాటులోకి రానుంది. దక్షిణభారతంలోనే మొట్టమొదట విజయవాడలోనే  ఈ రెస్టారెంట్‌ ఏర్పడనుండడం విశేషం.

సాక్షి,విజయవాడ : మారుతున్న కాలానుగుణంగా ప్రతి విషయంలో ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారు. ఈ ఫీవర్‌ రెస్టారెంట్ల విషయంలో అధికంగా ఉంది. ఇప్పటి వరకు రైలు భోగిల్లాగా, బస్సు ఆకారాల్లో, నీటిపైన తేలియాడే రెస్టారెంట్లను చూశాం. దీనికి భిన్నంగా ఏకంగా విమాన రెస్టారెంట్‌ కల్చర్‌ నగరంలో అడుగు పెట్టబోతుంది. దేశంలో నాలుగుచోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రెస్టారెంట్లు  ప్రస్తుతం దక్షిన భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా విజయవాడరూరల్‌ మండలం నిడమానూరులో ఆగస్టు చివర్లో అందుబాటులోకి రానుంది. 

చేరుకోవడానికే 50 రోజులు
ఎయిర్‌ఇండియాకు చెందిన 44 మీటర్ల పొడవు కలిగిన బోయింగ్‌ 737 విమానాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఓ భారీ ట్రైలర్‌ ట్రక్‌లో సుమారు 50 రోజుల పాటు రోడ్డు మార్గంలో నలుగురు  నిపుణులైన ట్రక్‌ డైవర్ల సారథ్యంలో ప్రయాణించి చివరికి నిడమానూరు చేరుకుంది. ఈ విమానం ఖరీదుకు కోట్ల రూపాయలు వెచ్చించగా ఢిల్లీ నుంచి నగరానికి తీసుకురావడానికే రూ.12లక్షలకు పైగా ఖర్చు చేయడం విశేషం. 

గేమింగ్‌ జోన్‌ సైతం..
ప్రస్తుతం ఈ విమానాన్ని రెస్టారెంట్‌కు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. ఇంటీరియర్స్‌ను చెక్కతో డిజైన్‌ చేస్తున్నారు. బాడీ మొత్తం ఆకర్షణీయమైన రంగులతో ముస్తాబు చేయనున్నారు. కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు సెంట్రల్‌ ఏసీ ఫుడ్‌ కోర్టు స్టాల్స్‌తో పాటు పిల్లలు గేమ్స్‌ ఆడుకునేందుకు గేమింగ్‌ జోన్‌కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 189 ప్యాంసింజర్స్‌ కెపాసిటీ కలిగిన ఈ బోయింగ్‌ విమాన రెస్టారెంట్‌లో 80 మంది సౌకర్యవంతంగా కూర్చునే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా విమాన రెక్కలపై కూడా సీటింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తుండటం విశేషం. 

చవులూరించే డిష్‌లు
భోజనప్రియుల కోసం ఈ విమాన రెస్టారెంట్‌లో కొత్త కొత్త  వెజ్, నాన్‌వెజ్‌ రుచులు అందించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. నార్త్, వెస్ట్‌ బెంగాల్, చైనీస్, ఆంధ్రా, గోదావరి రుచులతో పాటు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డిష్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందు కోసం ఆయా ప్రాంతాల నుంచి పేరుగాంచిన చెఫ్‌లతో నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top