గడిచిన ఏడాదిలో పెద్దగా రాణించని మార్కెట్లు
లార్జ్‌క్యాప్‌లతో పోలిస్తే చిన్న షేర్లవే మెరుపులన్నీ
స్మాల్‌క్యాప్ వెనక పరిగెడితే ప్రమాదాలూ ఎక్కువే
భారీ ర్యాలీల్లో ఊహించని స్థాయిలో మల్టీబ్యాగర్లు
పరిస్థితి మారితే 50 నుంచి 90 శాతం వరకూ నష్టాలు
ప్రతిసారీ మార్కెట్లు చెబుతున్న సత్యమిదే
ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి వెల్త్’ ఫోకస్
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల మంది ఆడినా... ఒక ఆటలో ఒలింపిక్ విజేత మాత్రం ఒక్కరే. విశ్వక్రీడా యవనికపై మెరిసేదీ ఆ ఒక్కరే. ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులకు స్ఫూర్తినిచ్చేదీ ఆ ఒక్కరే. మరి వేల మంది పరాజితుల సంగతో..? అదెవరికీ పట్టదు. ఇది తప్పేమీ కాదు. ఎందుకంటే విజేతల నుంచి స్ఫూర్తి పొంది వారిని అనుసరించిన వారు ఆ క్రీడలో ఎక్కడో ఒకచోట స్థిరపడతారు. నిజ జీవితంలోనూ ఇది మంచిదే!!. కానీ పెట్టుబడులతో ముడిపడ్డ స్టాక్ మార్కెట్లలోనో...?
స్టాక్ మార్కెట్లలోనూ గుర్తింపు విజేతలకే. ఎందుకంటే రెండేళ్లలో 5 రెట్లు పెరిగిన షేరు కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది. కానీ అదే రెండేళ్లలో 90 శాతం పతనమైన షేరును పట్టించుకోరెవరూ!. కానీ ఇవి రెండూ షేర్లే. రెండింటి నుంచీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భారీ ర్యాలీ తరువాత ఇన్వెస్ట్చేసినా ఇబ్బందే. బాగా పడిపోయింది కదా అని కొన్నా ఇబ్బందే.
ఇదంతా ఎందుకంటే... చిన్న షేర్లలో రాబడులు ఇన్వెస్టర్లను ఊరిస్తుంటాయి. ఆకర్షిస్తాయి. కానీ అదే స్మాల్‌క్యాప్ షేర్లలో తట్టుకోలేనంత రిస్కులూ ఉంటాయి. కాకపోతే అవి బయటకు కనిపించవు. భారతీయ స్టాక్ మార్కెట్లలో ఇపుడు స్మాల్‌క్యాప్ ఫీవర్ తారస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు రాబడులతో పాటు రిస్కులూ తెలియజేసేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...
మన మార్కెట్లలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ధోరణి కనిపిస్తూ ఉంటుంది. స్మాల్‌క్యాప్ షేర్లు పెరగటం మొదలైనపుడు ఇన్వెస్టర్లు చూసేది ఆ ర్యాలీ ఒక్కటే కాదు. ఆ ర్యాలీలో మల్టీబ్యాగర్లుగా మారే అవకాశమున్న షేర్లకోసం వేటాడతారు. అదే సమయంలో ఒక షేరు రెట్టింపవుతుంది. మరో షేరు 3 రెట్లు పెరుగుతుంది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో 5 రెట్లు... 10 రెట్లు పెరిగిన షేర్లంటూ కొన్నింటి గురించి సర్క్యులేషన్ మొదలవుతుంది. స్మాల్‌క్యాప్ ఫండ్లు అకస్మాత్తుగా ఆకర్షణీయంగా మారిపోతాయి. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) రిజి్రస్టేషన్లు పెరుగుతాయి.
అప్పటిదాకా ఏడాదికి 12–15% రాబడి వస్తే అద్భుతమని భావించిన ఇన్వెస్టర్లు కూడా... మిగతావాళ్లకు ఏడాదిలోనే రూ.లక్షకు రూ.5 లక్షలు వచ్చినపుడు తామెందుకు అంత తక్కువ రాబడితో సంతృప్తి పొందాలని భావిస్తారు. అదిగో... రిస్కు మొదలయ్యేది అక్కడే.
నిజానికి స్మాల్‌క్యాప్ షేర్లు సంపద సృష్టికి పనికిరావా అంటే... కచ్చితంగా పనికొస్తాయి. ఎందుకంటే దేశంలో అద్భుతమైన సంపద సృష్టించిన భారీ కంపెనీలు చాలావరకూ ఒకనాడు స్మాల్క్యాప్గా అడుగుపెట్టినవే. కాకపోతే ఏడాదిలో 300% పెరిగిన కంపెనీలున్నపుడు అదే ఏడాదిలో 70–80–90% పడిపోయిన షేర్లూ ఉంటాయని గుర్తించకపోవటం. ఎందుకంటే స్టాక్‌మార్కెట్ల చరిత్రలో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు.
మొదట స్టోరీ... ఆ వెంటే ధనప్రవాహం
స్మాల్‌క్యాప్ షేర్ల చక్రభ్రమణం తరచూ ఒకేలా ఉంటుంది. మొదట ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటమో... లేకపోతే ఈ రంగం మెరుగుపడటమో జరుగుతుంది. కంపెనీల ఆదాయం పెరుగుతుంది. కొన్నిషేర్లు రాణిస్తాయి. దాన్ని మొదట సంస్థాగత ఇన్వెస్టర్లు గుర్తిస్తారు. వారి కొనుగోళ్లతో ఆ షేర్లు రివ్వుమంటాయి. ఇక ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా కథనాలు మొదలవుతాయి. రిటైలర్లు ప్రవేశిస్తారు. అప్పటికే అది 2–3 రెట్లు పెరిగిందనుకోండి. ‘ఇంక ఆ తరవాత ఎంత పెరుగుతుంది?’ ఈ ప్రశ్నకు జవాబు కష్టం. ఎందుకంటే అప్పటికే ఈజీ ర్యాలీ కాలం ముగుస్తుంది మరి!!.
2016–17 ర్యాలీలో ఈ ధోరణి స్పష్టంగా కనిపించింది. 2014 జనవరి–2017 డిసెంబరు మధ్య బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 193% పెరిగింది. అప్పటినుంచి తిరుగుటపా మొదలైంది. 6 నెలలు గడిచేసరికి స్మాల్‌క్యాప్ సూచీ 15% నష్టపోయింది. సూచీలోని 67 షేర్లు సగానికన్నా ఎక్కువ పడిపోగా... చాలా షేర్లు 70–90% నష్టపోయాయి. దీనర్థం స్మాల్‌క్యాప్ షేర్లు చెడ్డవని కాదు. వాటి విలువ, లిక్విడిటీ, వ్యాపార నాణ్యతే ప్రతికూల పరిస్థితుల్లో వాటిని కాపాడతాయని. అవన్నీ చూశాకే ఇన్వెస్ట్ చేయాలని.
ఇవిగో కొన్ని ఉదాహరణలు...
వక్రంగీ: 207 శాతం లాభం... 92 శాతం నష్టం
ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాల్సిందంటే పెరుగుదల... తగ్గుదల ఒకటికాదు. ఎందుకంటే 100 శాతం పెరిగిన షేరు 50 శాతం పడిందంటే చాలు. ఆ పెరుగుదల కరిగిపోయినట్టే. ఫైనాన్షియల్ సేవల ఏజెన్సీ వక్రంగీ... 2017లో 207 శాతం పెరిగింది. 2018 జనవర్లో ఏకంగా రూ.515 దగ్గర ఆల్‌టైమ్ గరిష్ఠ ధరకు చేరింది. అక్కడ స్టోరీ మారింది. కంపెనీ వాస్తవాలు చెప్పటం లేదని, కార్పొరేట్ గవర్నెన్స్ లేదని ఆందోళనలు రేగాయి. షేరులో ఊగిసలాట మొదలైంది. జనవరిలో భారీగా పడి... అంతకన్నా వేగంగా పెరిగింది కూడా. కానీ 2018 చివరికల్లా 92 శాతం పడిపోయి రూ.50 కన్నా దిగువకొచ్చేసింది. ఇక్కడ గమనించాల్సిందొకటే.
→ రూ.500 దగ్గర అది ఖరీదైన షేరే... కానీ పెరుగుతోంది కనక ఆకర్షణీయం.
→ రూ.300 దగ్గర... మంచి బేరమే కాబట్టి కొనొచ్చని అనుకున్నారు చాలామంది.
→ రూ.150 దగ్గర... పడాల్సిన దానికన్నా ఎక్కువ పడిపోయిందనుకున్నారు.
→ రూ.50 దగ్గర... స్టోరీ మారింది. ఇక దీనివంక చూడటం అనవసరం అనుకున్నారు.
పడింది 92 శాతం. కానీ అది మళ్లీ పూర్వస్థాయికి రావాలంటే దాదాపు 900 శాతం పెరగాలి!!. అది సాధ్యమా? పూర్తిగా రికవరీ అయ్యేదాకా ఆ షేరును హోల్డ్ చేయటం కరెక్టా..? ఇపుడైతే వక్రంగీ ఏకంగా రూ.5 దగ్గర ఉందనుకోండి. అది వేరే విషయం.
పీజీ జ్యుయల్లర్స్: 90 శాతం పడ్డా... స్టోరీ ఇంకా ఉంది
ఇదో భిన్నమైన కథ. 2018 జనవరిలో ఈ షేరు ధర ఏకంగా రూ.587 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. తరవాత నాటకీయంగా పడిపోయి 2019 ఆగస్టు నాటికి రూ.27కు చేరింది. అంటే గరిష్ఠ స్థాయి వద్ద రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఏడాదిన్నర గడిచాక మిగిలింది రూ.4,600. ప్రమోటర్ల లావాదేవీలు... ఈ కంపెనీకి వక్రంగీతో ఉన్న అనుబంధం, పెరిగిన అప్పులు ఇవన్నీ కలిసి పీసీ జ్యుయలర్స్ను పడేశాయి. అది దీర్ఘకాలం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అలాగని పీసీ జ్యుయలర్స్ కథ అక్కడితో ముగిసిపోలేదు. రుణాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. మూలధనాన్ని సమీకరించింది. బ్యాలెన్స్ షీట్, కార్యకలాపాలు... అన్నీ మారాయి. 2025 నాటికి షేరు చెప్పుకోదగ్గ స్థాయిలో రికవరీ అయింది. దీన్నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే.
→ పడిపోయింది కదా అని ప్రతి షేరూ కొనటం కరెక్టు కాదు.
→ 90 శాతం పడ్డ షేరు... అక్కడి నుంచి మరో సగం పడదనే గ్యారంటీ లేదు.
→ 90 శాతం పడ్డాక ఆ కంపెనీ వ్యాపారం, పనితీరు మారితే తప్ప రికవరీ కష్టం.
అందుకే 90 శాతం పడిపోయింది కదా...
ఇంకేం పడుతుందిలే అని ఇన్వెస్ట్ చేయటం సరైన వ్యూహం కాదు.
మన్‌పసంద్ బేవరేజెస్.. అంతర్గత సమస్య
అప్పట్లో ఇది హాట్ ఫేవరెట్. 2017 సెపె్టంబర్లో దీని ధర రూ.512. అదిగో... అప్పుడు మొదలయ్యాయి హెచ్చరికలు. మొదట ఆడిటర్లు తప్పుకున్నారు. తరువాత కంపెనీపై పన్ను అధికారులు చర్యలకు దిగారు. కంపెనీ ఆర్థిక ఫలితాలపై స్క్రూటినీ మొదలైంది. షేరు పతనం మొదలైంది. 2018 జూలైకల్లా రూ.100 దిగువకొచ్చేసింది. మరో ఏడాది గడిచేసరికి రూ.10 కన్నా తక్కువకొచ్చేసింది. చివరకు ట్రేడింగ్ నిలిచిపోయింది. దీన్నుంచి గమనించాల్సిందేంటంటే...
→సంఖ్యల్లో వృద్ధిని చూస్తే సరిపోదు. అ సంఖ్యలు కరెక్టో కాదో కూడా తెలుసుకోవాలి.
డీహెచ్ఎఫ్ఎల్: షేరు విలువ జీరో అయిపోవచ్చు
ఒక షేరు 20 శాతం పడొచ్చు. 50 శాతం పడొచ్చు. 90 శాతం కూడా పడొచ్చు. కానీ విలువ పూర్తిగా అంతర్థానమవటం అనేది డీహెచ్ఎఫ్ఎల్ను చూసి తెలుసుకోవాలి. నిజానికి దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది దేశవ్యాప్తంగా తెలిసిన ఆర్థిక సేవల దిగ్గజం. అయితే లిక్విడిటీ లేదని, మొండి బాకీలు పెరిగాయని ఆందోళనలు రేగటంతో 2018 సెపె్టంబర్లో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ఒకేరోజు ఏకంగా 60 శాతం పడింది. తరవాత సంస్థ దివాలా పిటిషన్ వేసింది. 2021 పిరమల్ క్యాపిటల్ సంస్థ దాఖలు చేసిన పరిష్కార ప్రణాళికను ఎన్సీఎల్టీ ఆమోదించింది. దీనిప్రకారం సంస్థ ఈక్విటీ షేరుహోల్డర్ల వాటా విలువ జీరో అయిపోయింది. ట్రేడింగ్ నిలిచిపోయింది.
బ్రైట్‌కామ్ గ్రూప్: అమ్మటమే అసాధ్యమైతే...
కార్పొరేట్ గవర్నెన్స్ ఆందోళనలు చెరిగిపోలేదనటానికి తాజా సాక్ష్యం బ్రైట్‌కామ్ గ్రూప్. భారీ గా పెరిగి... దారుణంగా పతనమైన ఈ కంపెనీపై సెబీ చర్యలకూ దిగింది. రెండు త్రైమాసికాలు వరసగా ఆర్థిక ఫలితాలు ప్రకటించకపోవటంతో... ఈ కంపెనీ షేరు క్రయవిక్రయాలను నిలిపేస్తున్నట్లు 2024 జూన్‌లో ఎక్సే్ఛంజీలు ప్రకటించాయి. అంటే... షేరు పడటమే కాదు. కొన్నిసార్లు క్రయవిక్రయాలూ చేయలేం. చేతిలో షేర్లున్నా అమ్ముకోలేం. అదీ కథ.
అదిరిపోయే అద్భుతాలూ ఉన్నాయ్...
ఇన్వెస్టర్ల చేతులు కాల్చినవే కాదు. వారికి అద్భుతమైన లాభాలిచ్చి సంపద సృష్టించిన షేర్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే స్మాల్‌క్యాప్ షేర్లు ఊహించని సంపద సృష్టిస్తాయి. 2024 నాటి ర్యాలీనే తీసుకుందాం. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీలోని పలు షేర్లు మల్టీ బ్యాగర్లుగా మారాయి. జై బాలాజీ ఇండస్ట్రీస్ 20 రెట్లు పెరిగింది. వారీ రెన్యువబుల్ టెక్నాలజీస్ 9 రెట్లు పెరిగింది. జీఈ వెర్నోవా టీ అండ్ డీ, ఆరియన్ ప్రో సొల్యూషన్స్, ఫోర్స్ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, ఐనాక్స్ విండ్, సుజ్లాన్ ఎనర్జీ, హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ వంటివి గణనీయమైన లాభాలనిచ్చాయి. మొత్తంగా చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీలో 252 షేర్లు మల్టీబ్యాగర్లుగా మారాయి.
వారీ రెన్యువబుల్స్: ఏడాదిలోనే 15 రెట్లు!
సౌర విద్యుత్ రంగం సృష్టించిన మల్టీబ్యాగర్ ఈ కంపెనీ. ఎందుకంటే 2014 ఏప్రిల్ నాటికి ఈ షేరు ఒక ఏడాదిలోనే ఏకంగా 1,501 శాతం పెరిగి రికార్డు సృష్టించింది. ఒక స్మాల్‌క్యాప్ షేరు ఏ స్థాయిలో సంపద సృష్టించగలదో చూపించింది. కాకపోతే ఆ సమయంలో దీన్ని చూసి ఇన్వెస్ట్ చేయటం ప్రమాదకరమే. ఎందుకంటే 15 రెట్లు పెరిగాక అది ఏ స్థాయలో పెరిగిందో తెలుస్తుంది తప్ప... భవిష్యత్తులో ఏ స్థాయిలో పెరుగుతుందో తెలియదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లలో గత రికార్డులేవీ భవిష్యత్తుకు సూచనలు కావు. ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఇదే.
ఇన్వెస్టర్లూ... ఇవి గుర్తుంచుకోండి
→ ‘నా పోర్టుఫోలియోలో 80కి పైగా షేర్లున్నాయి. ఇందులో చాలా రంగాలున్నాయి కనక రిస్కు తక్కువ’ అని ఎవరైనా అంటే అది కరెక్టు అనుకోవద్దు. ఎందుకంటే చాలా రంగాలు అర్థిక చక్రంతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్, రైల్వే, ఇన్ఫ్రా, రెన్యువబుల్ ఎనర్జీ వంటి రంగాలకు చెందిన షేర్లు ఎన్ని ఉన్నా... కొన్ని ప్రత్యేక పరిస్థితులకు ఈ రంగాలన్నీ కామన్‌గా ప్రభావితమయ్యేవే.
→ ‘సిప్’ ఇన్వెస్ట్మెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్లు పడ్డపుడు నిలిపేయొద్దు. ఎందుకంటే ఆ సమయంలోనే యూనిట్లు తక్కువ ధరకు దొరుకుతాయి. అప్పుడు చేసిన ఇన్వెస్ట్మెంట్ల వల్లే రికవరీ వేగం పెరిగి... రాబడులూ మెరుగవుతాయి. సిప్ నిలిపివేసి మళ్లీ పెరిగేటపుడు మొదలుపెడితే... లాభాలు చూడటం కష్టం.
→ ‘ఏ స్మాల్‌క్యాప్ 10 రెట్లు పెరుగుతుంది?’ అని చూడొద్దు. దానిబదులు తాము ఇన్వెస్ట్ చేసే కంపెనీకి ఎలాంటి రిస్క్ లున్నాయో చూడాలి. స్మాల్‌క్యాప్ షేర్లు కొనే ముందు వాటి రుణాలు... క్యాష్‌ఫ్లో... ప్రమోటర్ల తనఖా పరిస్థితి... ఆడిటర్ల నాణ్యత... రావాల్సిన బకాయిలు... సంబంధిత పక్షాల లావాదేవీలు... ప్రమోటర్ల వాటా ఎంత?.. అప్పులేంటి?... వాల్యుయేషన్ సరైనదేనా..? అనేవి చూడాలి.
→ మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే అవే మల్టీ బ్యాగర్లు కావచ్చు. అంతేతప్ప మల్టీబ్యాగర్లను ఎంచుకుని, వాటికోసం ఇన్వెస్ట్ చేయటం సరికాదు.
లిక్విడిటీ.... కనిపించని రిస్కు
లార్జ్‌క్యాప్ షేర్లకు, స్మాల్‌క్యాప్ షేర్లకు ప్రధానమైన తేడా ఒకటుంది. అదే... లిక్విడిటీ. ఉదాహరణకు లార్జ్‌క్యాప్ షేరు ఏదో కారణంతో 10 శాతం పడిందనుకోండి. అయినా సరే దాన్ని కొనటానికి, అమ్మటానికి వేలమంది ఉంటారు. అదే స్మాల్‌క్యాప్ షేరైతే కథ వేరే ఉంటుంది. ఎక్కువ మంది కొనాలనుకునేటపుడు అది అప్పర్ సర్క్యూట్‌ను తాకి లాక వుతుంది. షేరు పెరుగుతుంటుంది తప్ప కొనాలంటే కావలసినన్ని షేర్లు దొరకవు. అదే పడ్డప్పుడైతే ఎక్కువ మంది విక్రయించడానికి ఉంటారు తప్ప కొనేవారెవరూ ఉండరు. డౌన్ సర్క్యూట్లో లాకవు తూ ఉంటుంది. షేరు పడుతూ ఉంటుంది త ప్ప విక్ర యించడం కష్టం. ఇది కేవలం స్మాల్‌క్యాప్ షేర్ల కే పరిమితమయిన ప్రమాదం. కనిపించని రిస్క్ .
మ్యూచువల్ ఫండ్లకూ ఈ రిస్క్ ఉంటుంది...
స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్లు రకరకాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనక రిస్క్ ను తగ్గించుకున్నట్టు కనిపిస్తాయి. కానీ ఒక కంపెనీ షేరు పడుతున్నపుడు బయటపడటం వాటిక్కూడా కష్టమే. సాధారణ ఇన్వెస్టర్లయితే తక్కువ షేర్లుంటాయి కనక ఏదో ధర దగ్గర బయటపడొచ్చు. ఫండ్లు బయటపడం అంత తేలికకాదు.
పైపెచ్చు స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఇన్వెస్ట్చేసేవారు పెరిగినపుడు ఆ నిధుల్ని తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయటం ఫండ్ మేనేజర్ల బాధ్యత. అలాగే మార్కెట్లు పడుతున్నపుడు ఇన్వెస్టర్లు కనక రిడీమ్ చేసుకుంటే కొన్ని షేర్లు విక్రయించయినా వారికి చెల్లించక తప్పదు. ఈ రెండు సందర్భాల్లోనూ వారు పెరిగిన ధర దగ్గర సైతం కొనటమో... లేక అసవరం లేకున్నా విక్రయించటమో చేయక తప్పదు. దీన్నిబట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటే. డైవర్సిఫైడ్ స్మాల్‌క్యాప్ ఫండ్ అన్నంత మాత్రాన రిస్కు తక్కువనుకోవద్దు.

ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి?
మరి ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? స్మాల్‌క్యాప్ షేర్లు కొనాలా... వద్దా? నిజానికి స్మాల్‌క్యాప్ షేర్లు కొనటమేమీ తప్పు కాదు. కానీ వేరెవరో కొన్నాక 5 రెట్లు పెరిగింది కాబట్టి మనమూ కొనాలనుకోవటం తప్పు. ఎందుకంటే 5రెట్లు పెరిగిందన్న వాట్సాప్ స్క్రీన్‌షాట్ మన దగ్గరకు వచ్చేసరికి స్టోరీ మారిపోయి ఉండొచ్చు. అప్పుడు కొనటం అంటే... గత చరిత్ర చూసి కొనటమే. చరిత్ర కాకుండా వ్యాపార నాణ్యత చూసి కొంటే అద్భుతాలకూ అవకాశం ఉంటుంది.
రమణమూర్తి మంథా


