●మేయర్‌ సీటుకు పోటీ వెనుక అక్రమార్జనే... | - | Sakshi
Sakshi News home page

●మేయర్‌ సీటుకు పోటీ వెనుక అక్రమార్జనే...

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

●మేయర్‌ సీటుకు పోటీ వెనుక అక్రమార్జనే...

సాక్షి ప్రతినిధి, కడప: అక్రమార్జనలో ఆయన ‘ఐడెంటీటీ’ పొందారు. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్లెయిమ్స్‌ చేసుకోవడంలో ‘కేర్‌’ తీసుకున్నాడు. ఈ పరిస్థితిని డాక్టర్‌ ఎన్టీయార్‌ వైద్య సేవా ట్రస్టు గుర్తించింది. ఆపై షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అంతేకాదు సరైన సమాధానం ఇవ్వకపోతే ట్రస్టు మార్గదర్శకాలకు ప్రకారం సస్పెన్షన్‌, చెల్లింపుల నిలిపివేత, జరిమానా లేదా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితా నుంచి తప్పించడం వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఆ షోకాజ్‌ నోటీసులో స్పష్టం చేశారు. ఆయనెవరో కాదు ప్రస్తుత కడప కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రథమ పౌరురాలుగా పోటీ పడుతోన్న మట్లి సువర్ణ భర్త డాక్టర్‌ మధుసూదనరెడ్డి. అంతటి ఘనమైన చరిత్ర డాక్టర్‌ మధుసూదనరెడ్డి సొంతం.

మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న కొన్ని దంత వైద్యశాలల్లో క్లెయిమ్‌లను పరిశీలించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ను డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు ఆదేశించింది. దంత వైద్యశాలల్లో ర్యాండమ్‌గా క్లెయిమ్‌లను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీని సైతం ఏర్పాటు చేసింది. సదరు నిపుణుల కమిటీ కొన్ని దంత వైద్యశాలలకు చెందిన వంద కేసులను పరిశీలించింది. అందులో 41 కేసులు మాత్రమే వాస్తవమైనవనిగా గుర్తించింది. మిగతావన్నీ అక్రమమేనని తేల్చారు. అందులో వైఎస్సార్‌ కడప జిల్లాలో ‘ఐడెంటిటీ’ పొందిన వైద్యుడుగా డాక్టర్‌ మధుసూదనరెడ్డి ఒకరు కావడం గమనార్హం. ఆ నివేదిక ఆధారంగా పోరుమామిళ్లలోని ఐడెంటిటీ మల్టీ స్పెషాలిటీ డెంటల్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ 2024 సెప్టెంబరు 12 నుంచి సస్పెన్షన్‌లో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేనెల 18వ తేది ట్రస్టు రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను ఈ కమిటీ ముందు ఉంచారు. అందులోనూ 55 కేసులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, 28 కేసులు మాత్రమే వాస్తవమైనవిగా గుర్తించారు. దాంతో డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు సీఈఓ జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను కమిటీ సమావేశం ఆమోదించింది.

‘కేర్‌’ ‘ఐడెంటీటీ’ ఆస్పత్రులల్లోనే అక్రమాలు...

కేర్‌, డెంటల్‌ క్లినిక్‌ ఎండీ డాక్టర్‌ మధుసూదనరెడ్డి నేతృత్వంలోనే ఐడెంటీటీ డెంటల్‌ క్లినిక్‌లు జిల్లాలో పలు శాఖలుగా నడుస్తున్నాయి. ఈరెండింటీ పరిధిలో 2025–26లో రూ.1.17 కోట్లు ఈహెచ్‌ఎస్‌ క్లెయిమ్స్‌ అక్రమంగా పొందినట్లు ఎన్టీయార్‌ వైద్య సేవా ట్రస్టు గుర్తించింది. ఐడెంటిటీ హాస్పిటల్‌, కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌ హాస్పిటల్‌ ప్రాంగణాలను తనిఖీ చేసి చికిత్స ఎక్కడ చేపట్టారో నిర్ధారించాలంటూ కడపలోని డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ను కమిటీ కోరింది. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు ఐడెంటిటీ హాస్పిటల్‌, కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌ హాస్పిటల్‌ పరిధిలోని అన్ని కేసుల విశ్వసనీయతను పరిశీలించాలని ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ కార్యనిర్వహణాధికారిని కోరింది. ఐడెంటిటీ మల్టీ స్పెషాలిటీ డెంటల్‌ ఆస్పత్రిలో 3,391 మంది రోగులు, అలాగే కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌ ఆస్పత్రిలో 5,615 మంది రోగులు చికిత్స పొందారని, అయితే ఈ రెండు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌ హాస్పిటల్‌ రోగులు, ఐడెంటిటీ ఆస్పత్రిప్రాంగణంలోనే చికిత్స పొందుతూ అక్కడే డిశ్చార్జి ఫొటోలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఆ నివేదిక ఆధారంగా భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. ఆడిట్‌ నివేదిక ప్రకారం రూ. 1,16,99,606లు రెండు ఆస్పత్రుల పరిధిలో క్లెయిమ్స్‌ పొందినట్లు గుర్తించి, ట్రస్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ చెల్లింపులు పొందినందుకు కేర్‌ డెంటల్‌ ఆస్పత్రిపై చర్యలు చేపట్టాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపద్యంలో ఈఏడాది ఫిబ్రవరి 16 షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఎల్‌ఆర్‌ నెంబర్‌ 458/డాక్టర్‌ ఎన్టీయార్‌ విఎస్‌టీ/ఎస్‌డిసీ/ 2025–26 ద్వారా వివరణ కోరారు. ట్రస్టు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా క్లెయిమ్‌లు పొందినందుకుగాను ఎందుకు క్రమశిక్షణా చర్యలు చేపట్టరాదో చెప్పాలని షోకాజ్‌ నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోపు సమగ్ర వివరణ ఇవ్వాలంటూ ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు.

ఓ మంత్రి సిఫార్సులతో....

ఎన్టీయార్‌ వైద్య సేవా ట్రస్టు షోకాజ్‌ నోటీసుతో ఒక్కమారుగా బెంబేలెత్తిన డాక్టర్‌ మధుసూదనరెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి సిఫార్సులతో షోకాజ్‌ నోటీసును తొక్కిపెట్టారు. ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా వచ్చిన ఓ ఐఏఎస్‌ అధికారిని ప్రసన్నం చేసుకొని నోట్లు కట్టలు ముట్టజెప్పి ఫైల్‌ క్లోజ్‌ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. షోకాజ్‌ నోటీసు, అక్రమంగా ఈహెచ్‌ఎస్‌ క్లెయిమ్స్‌ పొందడం వ్యవహారం బహిర్గతం కావడంతో వైద్య వర్గాలు నివ్వెరపోయాయి. ఇలా కూడా సంపాదించవచ్చా? అన్న సందిగ్ధంలో పలువురు వైద్యులు ఉండిపోయారు. డాక్టర్‌ మధుకు గురివింద గింజ సామెత చక్కగా వర్తిస్తుంది. తన నలుపు కప్పిపుచ్చుకొని నీతులు వల్లిస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

ఈహెచ్‌ఎస్‌ క్లెయిమ్స్‌ దోపిడీలో ‘కేర్‌’ంగ్‌!

డాక్టర్‌ మధుసూదనరెడ్డిని గుర్తించిన ఎన్టీయార్‌ వైద్యసేవా ట్రస్టు

2025–26లో రూ.1.17 కోట్లు అక్రమంగా పొందారని షోకాజ్‌ నోటీసు

ఈఏడాది ఫిబ్రవరి 16న నోటీసు

జారీ చేసిన వైద్యసేవా ట్రస్టు

ఆపై ఓ మంత్రి సిఫార్సులతో

తొక్కిపెట్టిన వైనం

ఓ వైపు కుటుంబంలో తండ్రి వెంకట్రామిరెడ్డి అర్ధాంతర మృతి, మరోవైపు వ్యవస్థల్లో ఉన్న లొసుగులు ఆధారంగా లబ్ధిపొందడం, ఇంకోవైపు తనకంటే నీతిగల వ్యక్తి లేడని ప్రచారం చేసుకోవడంలో డాక్టర్‌ మధసూదనరెడ్డి ముందువరుసలో నిలిచారని వైఎస్సార్‌సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. డెంటల్‌ డాక్టర్‌గానే అనేక అక్రమాలకు కారణభూతుడైన ఆయన ఇంటికి మేయర్‌ పీఠం చేరువైతే, కడప నగరం అక్రమాల్లో ఆదర్శంగా విరాజిల్లుతుందని పలువురు విమర్శిస్తున్నారు. మేయర్‌ సీటు దక్కడానికి సైతం అక్రమార్జన కలిసి వచ్చిందని టీడీపీ సీనియర్‌ నేతలు సైతం వాపోతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement