కడప సిటీ : ప్రముఖ సూఫీ ఆఽధ్యాత్మిక క్షేత్రమైన కడప పెద్దదర్గాలో ప్రధాన ఉరుసు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కూడా భక్తుల కోలాహలంతో దర్గా ప్రాంతం సందడిగా కనిపించింది. దేశం నలుమూలల నుంచి భక్తులు దర్గాకు విచ్చేసి గురువుల దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. సినీ నటుడు వరుణ్‌సందేశ్ దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురువారం పీఠాధిపతి, ఇతర భక్త ప్రముఖులు గండి వాటర్ వర్క్స్ వద్దగల దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, జెండాను ప్రతిష్ఠించి అన్నదానం చేసి నగరానికి చేరుకుంటారు. రాత్రి 10 గంటలకు స్థానిక మై అల్లా దర్గా నుంచి పీఠాధిపతి నగరోత్సవం ప్రారంభం కానుంది.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా స్థాయి పుట్‌బాల్ ఎంపికలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 సెక్రటరి మురళీకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు 82 మంది హాజరయ్యారు. ఈ ఎంపికలకు పరిశీలకులుగా నాగేశ్వర్ రెడ్డి, నీలకంఠ కోచ్‌లుగా హరి, అమృతరాజ్ వ్యవహరించారు. ఎంపికై న క్రీడాకారులు 5వ తేదీన పుత్తూరులో జరిగే అంతర్ జిల్లా పోటీలకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. అదే మైదానంలో నిర్వహించిన హాకీ ఎంపికలకు క్రీడాకారులు విశేషంగా పాల్గొన్నారు. ఈ ఎంపికలకు 94 మంది హాజరైనట్లు తెలిపారు. పరిశీలకులుగా చంద్రమోహన్ రాజు పరిశీలకులుగా అనిల్, ఖాదర్ భాషాలు కోచ్ లుగా వ్యవహరించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 7న పులివెందులలో జరిగే అంతర్ జిల్లాల క్రీడా పోటీలలో పాల్గొనాలని తెలిపారు.
ఆసక్తికరంగా నెట్‌బాల్ ఎంపికలు
కడప నగరంలోని జెఎంజె కళాశాలలో అండర్–14, 17 బాలబాలికల జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్ అండర్–14, 17 సెక్రటరీలు విజయలక్ష్మీ, నాగరాజారెడ్డి తెలిపారు. ఈ ఎంపికలకు దాదాపు 300 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు.
కడప ఎడ్యుకేషన్ : ప్రపంచ మత్స్య దినోత్సవం (వరల్డ్ ఫిషర్స్ డే) సందర్భంగా నవంబర్ 24న యోగివేమన విశ్వవిద్యాలయంలో నీలి భవిష్యత్తు కోసం సుస్థిర జల వ్యవసాయం, జలచరాల ఆరోగ్యం, జీవ వైవిధ్య పరిరక్షణ, ఆహార భద్రతలో ఆవిష్కరణలు–2 అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం వీసీ తన చాంబర్లో ఆచార్యులతో కలిసి విడుదల చేశారు. సదస్సు నిర్వహణ, దాని ప్రయోజనాలను చర్చించారు. సదస్సు కన్వీనర్ జువాలజీ శాఖ విభాగాధిపతి ప్రొఫెసర్ అను ప్రసన్న, పీఎం ఉషా, కోఆర్డినేటర్ ఆచార్య టి.చంద్రశేఖర్, నిర్వాహక కమిటీ సభ్యులు ప్రొఫెసర్ ఎన్.వెంకటరామి రెడ్డి, మరియ దాసు పాల్గొన్నారు.


