పాలసీ బాండు ఇవ్వకుండా నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పాలసీ బాండు ఇవ్వకుండా నిర్లక్ష్యం

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

ప్రొద్దుటూరు క్రైం : పాలసీబాండు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించి పాలసీదారురాలిని ఇబ్బందులకు గురిచేసిన కొటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లిమిటెడ్‌లకు కడప జిల్లా వినియోదారుల ఫోరం షాక్‌ ఇచ్చింది. ప్రీమియం మొత్తం రూ.2,06,806ను వార్షికంగా 6 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. బాధితురాలికి మానసిక వేదన, ఒత్తిడికి పరిహారంగా రూ.10 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ.3 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రొద్దుటూరుకు చెందిన న్యాయవాది సీవీ జయలక్ష్మి ఈ విషయమై వినియోదరారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కొటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లిమిటెడ్‌లను ప్రతివాదులుగా పేర్కొంటూ ఫిర్యాదు దాఖలు చేశారు. పాలసీకి సంబంధించిన బాండును అందించకుండా నిర్లక్ష్యం చేయడంతో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఇన్సూరెన్స్‌ కంపెనీ, బ్యాంకు ప్రతినిధులు కమిషన్‌ ఎదుట హాజరై, ఫిర్యాదులోని అంశాలు అవాస్తవమంటూ కౌంటర్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు, అందుబాటులో ఉన్న అంశాలను పరిశీలించిన వినియోగదారుల కమిషన్‌ చైర్మన్‌ టి.అబ్దుల్‌రసూల్‌, సభ్యులు మురళీకృష్ణ, చంద్రవదన్‌.. పాలసీ బాండు అందించడచంలో నిర్లక్ష్యం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో ఫిర్యాదును పాక్షికంగా అనుమతిస్తూ, ప్రీమియం మొత్తం రూ.2,06,806పై 2024 జూన్‌ 3 నుంచి చెల్లింపు జరిగే వరకు ఏడాదికి 6 శాతం వడ్డీ చెల్లించాలని ప్రతివాదులు1, 2లను ఆదేశించారు. అదనంగా మానసిక వేదనకు రూ.10 వేలు, ఫిర్యాదు ఖర్చుల కింద రూ.3 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వు అందుకున్న తేదీ నుంచి 45 రోజుల్లోగా ఈ మొత్తాలను చెల్లించాలని స్పష్టం చేశారు.

చేతికొచ్చిన కుమారుడు బ్లాస్టింగ్‌లో బుగ్గిపాలు

బ్రహ్మంగారిమఠం : మండల పరిధి చెంచయ్యగారిపల్లెలోని తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆదిబోయిన గురువయ్య కుమారుడు గురు పవన్‌(22) అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు బ్లాస్టింగ్‌లో మృతి చెందడంతో.. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గురు పవన్‌ ఈ మధ్యనే ఎంబీఏ పూర్తి చేసి ఇంటి దగ్గరనే ఉన్నాడు. బి.మఠం మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు, చెంచయ్యగారిపల్లెకు చెందిన ముడుమాల పోలిరెడ్డి దగ్గర గురువయ్య కాంట్రాక్టు పనుల్లో ఉంటున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా పోలిరెడ్డి, గురవయ్యలు ఇంటికి వచ్చారు. గురువయ్య కుమారుడు గురు పవన్‌ను రోడ్డు పనుల కోసం పంపించారు. రోడ్డు పనులు జరుగుతున్న సందర్భంగా శనివారం బ్లాస్టింగ్‌ ఏర్పాటు చేయడంతో ప్రమాదంలో గురు పవన్‌ మృతి చెందాడు. చేతికి వచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గురువయ్య మల్లేపల్లె ఎంపీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇటీవల నామినేషన్‌ వేశారు.

బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలు

మదనపల్లె టౌన్‌ : కురబలకోట మండలం సర్కారు తోపు సమీపంలో శనివారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో సర్కారు తోపునకు చెందిన తేజ, మోహన్‌రెడ్డి గాయపడ్డారు. వారిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

● అల్లూరి జిల్లాలో మండల వాసి మృతి

● చెంచయ్యగారిపల్లెలో విషాద ఛాయలు

ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఫోరం వడ్డింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement