నేడు ఒంటిమిట్టకు హైకోర్టు జడ్జి | - | Sakshi
Sakshi News home page

నేడు ఒంటిమిట్టకు హైకోర్టు జడ్జి

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ లక్ష్మణరావు ఆదివారం దర్శించుకోనున్నారని ఆలయ టీటీడీ ఏఈవో రవి తెలిపారు. జడ్జికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, స్వామి వారిని దర్శింపజేసి, ప్రత్యేక పూజలు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌)లో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగినట్లు ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 సెక్రటరీలు విజయలక్ష్మి, నాగరాజారెడ్డి తెలిపారు. శనివారం కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో స్కేటింగ్‌, చెస్‌, క్రికెట్‌, ఖురాష్‌ వంటి క్రీడా పోటీల్లో ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అదే విధంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్‌ జిల్లా స్థాయి ఎంపికలు చేపట్టారు. దాదాపు 750 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతిభ చాటారు. జిల్లా స్థాయికి ఎంపికై న వారు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఎక్కడ నిర్వహించేది ఖరారు చేయలేదని, ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 సెక్రటరీలు తెలిపారు.

ఐదుగురిపై కేసు నమోదు

చక్రాయపేట : చక్రాయపేట బైపాస్‌ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కల్లూరుపల్లె గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై శుక్రవారం దాడి చేసిన టీడీపీకి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్‌కేఎం హుస్సేన్‌ తెలిపారు. గాయపడ్డ ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈశ్వరయ్యతోపాటు ఆయన అన్న అంజనప్ప నాయుడు.. వారి మేనకోడలు శ్రీజను చక్రాయపేటలోని కస్తూర్బా పాఠశాలలో వదిలి.. తిరిగి తమ ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలు దేరారు. బైపాస్‌ రోడ్డులోని డాబా హోటల్‌ సమీపంలోకి రాగానే.. కల్లూరుపల్లె గ్రామానికి చెందిన సిద్దా వెంకట మల్లప్ప నాయుడు, వెంకటపతి నాయుడు, చిలేకాంపల్లె గ్రామానికి చెందిన మావిరెడ్డి, కుమారకాల్వ గ్రామానికి చెందిన ప్రవీణ్‌, చక్రాయపేటకు చెందిన హిదయతుల్లా అక్కడ ఉన్నారని బాధితులు చెప్పారు. తమ పొలాల దగ్గర వున్న దారి విషయం మనసులో పెట్టుకొని వుండిన వెంకటమల్లప్ప నాయుడు, వెంకటపతి నాయుడు అడ్డుపడి.. ‘ఈ నా కొడుకులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఇన్ని రోజులు తప్పించుకు తిరుగుతున్నారు. ఈ రోజు దొరికారు చంపండి’ అని అంటూ వారితోపాటు మావిరెడ్డి, ప్రవీణ్‌, హిదయతుల్లా తమపై రాడ్లు కట్టెలతో దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు పై ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement