కడప అర్బన్ : కడపలోని కేంద్ర కారాగారం, మహిళా ప్రత్యేక కారాగారాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్ శనివారం తనిఖీ చేశారు. బోర్డ్ ఆఫ్ విజిటర్స్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కారాగారాల్లోని ఖైదీల రూమ్‌లు, వంటశాలలు, హాస్పిటల్, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ, ఖైదీలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఖైదీలు వివిధ వృత్తి నైపుణ్యాల ద్వారా తయారు చేస్తున్న వస్తువులు, వాటి తయారీ ప్రక్రియ, చేపడుతున్న పనులను పరిశీలించి, ఈ కార్యకలాపాల నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఖైదీల హక్కుల పరిరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్య సంరక్షణ, న్యాయ సహాయం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, సంబంధిత నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ ఎస్.బాబా ఫక్రుద్దీన్. డీఆర్‌ఓ కె.మల్లికార్జునుడు, డీఎంహెచ్‌ఓ యుగంధర్, పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.చెంగలరాయుడు, డీఈఓ డా.ఎస్.షంషుద్దీన్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ సి.లక్ష్మినారాయణ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎ.సురేష్ కుమార్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్ యం.సుబ్రమణ్యేశ్వరరావు, పురుషుల, ప్రత్యేక మహిళ కారాగారాల సూపరింటెండెంట్‌లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.


