ప్రొద్దుటూరు : అధికార పార్టీ నేతలకు సాధారణ అధికారులతోపాటు పోలీసులు సైతం సలాం చేసే దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణ. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వెళ్లినా వెళ్లకపోయినా నామినేషన్లను తీసివేయడం, అధికార పార్టీ నేతలైతే ఆమోదం తెలపడం జరుగుతోంది. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నామినేషన్‌పై దుమారం చెలరేగుతోంది. ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా బచ్చల వీరప్రతాప్ శుక్రవారం కడప జెడ్పీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈయన మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య తనయుడు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఇదే అభ్యర్థి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్‌గా కూడా పోటీ చేశారు. దీంతో ఒకే అభ్యర్థికి ఓటు హక్కు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనూ, ఇటు ప్రొద్దుటూరు మండలంలోనూ ఎలా ఉంటుందని మేధావులు ప్రశ్నిస్తున్నారు. బచ్చల వీరప్రతాప్‌కు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రెండో ఎంపీటీసీ ఓటర్ల జాబితాలో వరుస సంఖ్య 4761లో ఈయన పేరు ఓంది. అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 49వ వార్డులో ఓటర్ల జాబితా వరుస సంఖ్య 1229లో ఈయన పేరు ఉంది. ఒకే అభ్యర్థి రెండు చోట్ల వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉంటుందో అధికారులే చెప్పాలి. ఇప్పటికై నా ఎన్నికల కమిషన్ అధికారులు వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు విషయం ఏమంటే ప్రొద్దుటూరు మన్సిపల్ చైర్మన్ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసిన ఈయన నామినేషన్ కూడా చెల్లుబాటు అయిందని అధికారులు ధ్రువీకరించారు. తర్వాత ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బచ్చల వీరప్రతాప్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మేరువ ఓబయ్య యాదవ్ స్క్రూటినీలో శనివారం అధికారులకు ఫిర్యాదు చేశారు.
గోపవరం గ్రామ పంచాయతీలో
బచ్చల ప్రతాప్‌కు ఓటు హక్కు
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో బచ్చల ప్రతాప్‌కు ఓటు హక్కు
మున్సిపల్ చైర్మన్‌గా, జెడ్పీటీసీగా పోటీ చేసిన బచ్చల వీరప్రతాప్
ఒకే అభ్యర్థికి రెండో చోట్ల ఓటుపై ఫిర్యాదు
అధికార పార్టీకి ఎన్నికల కమిషన్ నిబంధనలు వర్తించవా?


