బద్వేలు అర్బన్ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పును గౌరవించడం చాలా ముఖ్యమని, అలా కాకుండా అక్రమాలకు పాల్పడి సాధించిన విజయం తాత్కాలికమే అనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలని ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన ప్రక్రియలో జరిగిన అక్రమాలపై మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నియోజకవర్గ యువ నాయకులు దేవసానిఆదిత్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాచపూడివెంకటసాయిక్రిష్ణలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతుడు, గత మూడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం ఉన్న చైర్మన్ అభ్యర్థి ఆర్.వి.సాయిక్రిష్ణ నామినేషన్‌ను తిరస్కరించడం దారుణమన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఇప్పటివరకు తమ చైర్మన్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యులు వేసిన నామినేషన్లను ఎందుకు తిరస్కరించారో చెప్పకపోవడం సరికాదన్నారు. గడిచిన 25 ఏళ్లలో ఇటువంటి నీచ సంస్కృతిని చూడలేదని అన్నారు. టీడీపీ నేతలకు ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో గెలవాలని వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యరెడ్డి అన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.
అధైర్యపడొద్డు.. అండగా ఉంటాం
నామినేషన్ల సందర్భంగా దాడికి గురైన 14వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ మాబుచాన్, ఆమె సోదరుడు గౌస్‌బాషా, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ హసాన్‌లను గోవిందరెడ్డి, ఆదిత్యరెడ్డి పరామర్శించారు. బాధితులపైనే కేసులు నమోదు చేయడం దారుణమని గోవిందరెడ్డి అన్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని, బాధ్యులపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు దేవసానిఆదిత్యరెడ్డి, నియోజకవర్గ బూత్‌కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాచపూడిసాయిక్రిష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, మాజీ కుడా చైర్మన్ గురుమోహన్, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు అల్లాబకాష్, యద్దారెడ్డి, కేశవరెడ్డి, రమేష్‌బాబు, పుత్తాశ్రీరాములు, ఉమర్, చెన్నకృష్ణారెడ్డి, సుబ్బరాజ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి


