పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చెన్నారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న వైఎస్సార్‌సీపీ నాయకులు నిరంజన్‌రెడ్డి ఇంటి వద్ద ఉన్న లారీలకు టీడీపీ అల్లరి మూకలు నిప్పు పెట్టి కాల్చివేశారు. నిరంజన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ తరపున మున్సిపల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న రెండు లారీలకు నిప్పు అంటించారు. అలాగే నగరిగుట్టకు చెందిన వైఎస్సార్‌సీపీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి అంజనప్ప ఇంటి వద్ద కూడా ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించారు. పట్టణంలోని పార్నపల్లె రోడ్డులో ఉన్న మరో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీరాములు ఇంటి వద్ద ఉన్న ద్విచక్ర వాహనానికి కూడా నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎన్నికల వేళ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఎన్నికల్లో గెలవలేమనే భయంతో దాడులు
ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేయడం నుంచి పరిశీలన వరకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రశాంతంగా, స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే వాతావరణం లేదని విమర్శించారు. గతంలో చెరుకు రసం దుకాణం దగ్ధమైన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయినా నిందితులపై చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఘటనలో అక్కులగారిపల్లె విజయ్‌కుమార్‌రెడ్డి, షామీర్‌ల ప్రమేయం ఉందని పేర్కొంటూ వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కౌన్సిలర్ అభ్యర్థి నిరంజన్‌రెడ్డికి చెందిన చెక్కులను సైతం కాల్చివేశారని తెలిపారు. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
లారీలు, బైక్‌లకు నిప్పు పెట్టిన
టీడీపీ అల్లరి మూకలు


