పదవులనూ రికవరీ చేస్తాం! | - | Sakshi
Sakshi News home page

పదవులనూ రికవరీ చేస్తాం!

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

దొంగ సొత్తులా..

● నామినేషన్లు వేయనివ్వని పోలీసులు ఉన్నా.. లేకున్నా ఒకటే

● టీడీపీ దౌర్జన్యాలపై ఎస్పీది ప్రేక్షకపాత్ర

● కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపాటు

కడపకార్పొరేషన్‌ : దొంగలు దొంగిలించిన సొత్తును పోలీసులు రికవరీ చేసినట్లు.. దౌర్జన్యాలు, అరాచకాలు, దాడులతో దొంగిలిస్తున్న స్థానిక సంస్థల పదవులను రానున్న రోజుల్లో రికవరీ చేస్తామని కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుదతూ నామినేషన్లు వేసేందుకు తమ అభ్యర్థులు పోతే టీడీపీ నాయకులు నామినేషన్‌ కేంద్రంలో చించేస్తున్నారన్నారు. పెండ్లిమర్రి, సీకేదిన్నె, వేంపల్లి మండలాల జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు చించేశారన్నారు. పోలీసులు టీడీపీ గూండాలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఉదయం తమ పార్టీ నాయకులకు అనేక ఆంక్షలు విధించి, గృహ నిర్బంధాలు చేశారన్నారు. చాలామందిని పోలీస్‌స్టేషన్‌లలో ఉంచారన్నారు. నామినేషన్లు వేసేందుకు 15 మంది మహిళా అభ్యర్థులు వస్తే వారిని పోలీసులు నామినేషన్లు వేయడానికి అనుతించకపోవడం అన్యాయమన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి, లక్ష్మిరెడ్డిలు నామినేషన్‌ కేంద్రంలో తిష్టవేసి నామినేషన్లు చించేస్తున్నారన్నారు. నామినేషన్లు స్వేచ్ఛగా వేయించలేని పోలీసులు ఉన్నా లేకున్నా ఒకటే అని అన్నారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా జిల్లా ఎస్పీ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు.

అక్రమాలతో గెలిస్తే గౌరవిస్తారా?

ఎన్నికల్లో ఇన్ని అక్రమాలు చేసి ఎన్నికై న వారిని ప్రజలు గౌరవించే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలా గూండాగిరీ చేసి నామినేషన్లు వేయనివ్వలేదో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అచ్చం అలాగే చేస్తున్నారన్నారు. తమను అడ్డుకోవడానికే పోలీసులు పనిచేస్తున్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 144 సెక్షన్‌, 30యాక్టు వైఎస్సార్‌సీపీ నాయకులకు తప్పా అధికార టీడీపీ నాయకులకు వర్తించదా అని నిలదీశారు. మీరు మగాళ్లయితే, మీ మూతిపై మీసం ఉంటే ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, లేదా పోలీసులను పక్కనబెట్టి రండి... తగులుదాం అంటూ సవాల్‌ విసిరారు. కడపలో వైఎస్సార్‌సీపీ తరపున ఒక్క బీ. కోడూరు జెడ్పీటీసీ అభ్యర్థి మినహా మరెక్కడా నామినేషన్లు దాఖలు కాలేదని, 39 మండలాల్లో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు కూడా దాఖలు కాలేదన్నారు. ఈ ఎన్నికలను చూసి ప్రజలు బండబూతులు తిడుతున్నారన్నారు. కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement