కడప కార్పొరేషన్: వెనుకబడిన వర్గాలు(బీసీ)లను వంచించడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లను ప్రకటించారని వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు సిద్దవటం యానాదయ్య విమర్శించారు. గురు వారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీసీల గణన చేపట్టి పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశముందన్నారు. కానీ చంద్రబాబుకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని,బీసీలు ఎప్పటికీ ఓట్లు వేసే యంత్రాలుగా ఉండాలి. కులవృత్తులు చేసుకుంటూ ఉండాలన్నదే ఆయన సిద్ధాంతమన్నారు. కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లపై వేసిన డెడికేషన్ కమిషన్ రాష్ట్రంలో ఎక్కడా పర్యటించలేదని, ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించలేదన్నారు. అందుకే హైకోర్టులో ఈ అంశం వీగిపోయిందన్నారు. బీసీల పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరికి స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్. బసవరాజు మాట్లాడుతూ బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు రెండు నెలలుగా డ్రామాలాడుతున్నారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సింధే రవిచంద్రరావు, బహుజన నగర్ వెంకటేష్ పాల్గొన్నారు.


