‘స్థానిక’ పోరులో పోలీసులను నమ్ముకున్న కూటమి | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ పోరులో పోలీసులను నమ్ముకున్న కూటమి

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

జమ్మలమడుగు : రాబోయే మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ కేవలం పోలీసులను నమ్ముకుని రంగంలోకి దిగుతుందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగుంట్లలో కార్యకర్తలు, నాయకుల సమావేశాన్ని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు పోలీసులను మాత్రమే నమ్ముకున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను నామినేషన్‌ వేయనివ్వబోం, గెలువనివ్వం అని చెబుతున్నాడని పేర్కొన్నారు. ఇది కేవలం పోలీసుల అండతో ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఆయన మాట్లాడుతున్నారన్నారు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఆపరేషన్‌ సింధూర్‌ చేపడుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఆదినారాయణరెడ్డి తనకు తానుగా సింధూర్‌ పరార్‌గా అంటూ పరిపోవడం జరుగుతుందన్నారు. గతంలో ఆయనను తాము చూశామన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కాదు నడిచేది డబుల్‌ ట్యాక్స్‌ సర్కార్‌ అన్నారు. బాబాయ్‌ ఆదినారాయణరెడ్డి, అబ్బాయ్‌ భూపేష్‌రెడ్డి జమ్మలమడుగు నియోజవర్గంలోని సిమెంట్‌ ఫ్యాక్టరీలు, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు, ఫ్లయాష్‌లతోపాటు వ్యాపారులపై పడి వారి వద్ద నుంచి భారీగా ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆల్ట్రాటెక్‌(ఐసీఎల్‌) యాజమాన్యంపై అనుచరులతో బెదిరింపులకు పాల్పడటంతోపాటు సిమెంట్‌ పరిశ్రమలో పనులు జరగకుండా నిలిపివేసి.. అందులో ప్రతి కాంట్రాక్ట్‌ తమకే కావాలంటూ ఒత్తిడి చేసి వేలాది మంది కార్మికుల కడుపులు కొట్టారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా పరిశ్రమల జోలికి వెళ్లలేదన్నారు.

ఈ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం

చంద్రబాబు నాయుడు, లోకేష్‌ల వద్దకు వెళ్లి జిల్లాలో బద్వేలు, పులివెందుల నియోజకవర్గాల్లో మున్సిపల్‌ ఎన్నికల్లో తన మంది మార్భాలంతో వెళ్లి గెలిపించుకుని వస్తానంటూ ఆదినారాయణరెడ్డి ప్రగాల్భాలు పలుకుతున్నాడన్నారు. గతంలో ఆదినారాయణరెడ్డి 50 వేల రూపాయల కోసం పులివెందులలోని రాజారెడ్డి వద్దకు వచ్చి రాత్రింబవళ్లు కొన్ని రోజుల పాటు ఇంటి వద్ద కాపలా ఉండే వారన్నారు. వారికి కావాల్సిన వాహనాలను వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమకూర్చే వారన్నారు. అలాంటి వారిపైన ఆదినారాయణరెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కార్యకర్తలు, నాయకులు తమ భుజస్కంధాలపై వేసుకుని పని చేయాలన్నారు.

ఇప్పటికే అధికారులకు ఆదేశాలు

అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ వార్డు, గ్రామ సెక్రటరీలు.. ప్రతిపక్ష పార్టీ నాయకులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఇంకా పత్రాలు ఇవ్వకుండా వారికి అందుబాటులో లేకుండా పోవాలంటూ ఆదేశాలు జారీ చేశారన్నారు. కాబట్టి ఎన్నికలకు ముందు పోటీ చేయటానికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు.

రాబోయేవి మంచి రోజులు

ఇప్పటికే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రామసుబ్బారెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత సుధీర్‌రెడ్డికి కూడా ఇవ్వడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి ఎర్రగుంట్ల, జమ్మలమడుగు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులకు అండగా నిలుస్తారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోనికి రావడం ఖాయమని, కావున కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో గట్టిగా నిలిచి పోటీ చేయాలని, తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

అన్నమయ్య జిల్లాలో స్వయంగా

కలెక్టర్‌ సిబ్బందికి దిశానిర్దేశం

ఆదినారాయణరెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు

కార్యకర్తలు, నాయకులకు అండగా నిలుస్తాం

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement