మంగపట్నం పొలంలో చీనీచెట్లను కొట్టేసిన దృశ్యం
● ఎండుముఖం పట్టిన చీనీ,అరటి పంటలు ● కొట్టేస్తున్న రైతన్నలు
ముద్దనూరు: చేతికందాల్సిన పంట చేలోనే ఎండిపోతే... సిరులొలికించాల్సిన సాగు కళ్లముందే వాడిపోతే... ఆ రైతుపడే వేదన వర్ణనాతీతం.. జిల్లాలోని ముద్దనూరు మండలంలో ఇదే జరుగుతోంది. వర్షాల్లేక పోవడం.. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చీనీ,అరటి తదితర ప్రధాన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. మంగపట్నం, ఆరవేటిపల్లె,దేనేపల్లె తదితర గ్రామాల్లో సాగులో ఉన్న సుమారు 1500 ఎకరాల్లోని చీనీ చెట్లు ఎండుముఖం పట్టాయి. దీంతో చేసేదిలేక కొందరు రైతులు వాటిని కొట్టేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూములను బీడుగా వదిలివేయాల్సి వస్తోందని ఇప్పటికే తాము ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయి
2 ఎకరాల్లో చీనీ చెట్లు సాగుచేస్తున్నాను. రెండు బోర్లలో నీటిమట్టం పడిపోయి సాగునీరు అందడంలేదు. వర్షాలు లేకపోవడంతో నీటి ఎద్దడి తీవ్రతరమైంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– నడిపి బయపురెడ్డి, చీనీ రైతు, మంగపట్నం.


