ఎట్టకేలకు ఆగనున్న వెంకటాద్రి! | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఆగనున్న వెంకటాద్రి!

Oct 1 2026 12:35 AM | Updated on Oct 1 2026 12:35 AM

● ఎనిమిదేళ్ల ఎదురుచూపునకు మోక్షం

● ఈ నెల 3 నుంచి నందలూరులో స్టాపింగ్‌

రాజంపేట : జిల్లాలో రైల్వేపరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రానికి సంబంధించి స్థానిక ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. చిత్తూరు – కాచిగూడ మధ్య నడుస్తున్న ప్రతిష్టాత్మక వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నంబరు: 12797/98) హాల్టింగ్‌కు రైల్వేబోర్డు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 3వ తేదీ నుంచి నందలూరు స్టేషన్‌లో ఈ రైలు నిలవనుందని బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ పేరిట అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, ప్రయాణికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎనిమిదేళ్ల పోరాటానికి ఫలితం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ 1975 మే 19న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తొలి సర్వీసు ప్రారంభమైంది. అయితే, గత ఎనిమిదేళ్లుగా నందలూరులో ఈ రైలు హాల్టింగ్‌ కోసం స్థానికులు ఎదురుచూస్తున్నారు. గతంలో కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ సమయంలో అన్ని రైళ్లను ప్రత్యేక సర్వీసులుగా మార్చిన తరుణంలో, నందలూరులో వెంకటాద్రి సహా పలు రైళ్ల హాల్టింగ్‌ను రైల్వే శాఖ ఎత్తివేసింది. కోవిడ్‌ మహమ్మారికి ముందు ఈ స్టేషన్‌లో రైలు ఆగేది. మహమ్మారి తగ్గుముఖం పట్టి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినా హాల్టింగ్‌ పునరుద్ధరించకపోవడంతో వందలాది మంది రైల్వే కార్మికులు, స్థానిక ఉద్యోగులు, యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇక్కడ స్టాపింగ్‌ ఇవ్వడం విశేషం.

ఫలించిన ఎంపీ మేడా కృషి

ఈ రైలు పునరుద్ధరణలో రాజ్యసభ సభ్యుడు, రైల్వే స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి చేసిన కృషి కీలక పాత్ర పోషించింది. ఇటీవల జరిగిన రైల్వే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన నందలూరు రైల్వే కేంద్రం ప్రాముఖ్యతను, స్థానికుల అవసరాలను రైల్వే బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సానుకూలంగా స్పందించిన బోర్డు హాల్టింగ్‌కు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఎంపీ మేడా రఘునాథరెడ్డికి స్థానికులు, రైల్వే కార్మిక సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

నందలూరులోని ప్రసిద్ధ సౌమ్యనాథ స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చే భక్తులకు, అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి వెళ్లే యాత్రికులకు ఈ రైలు నిలుపుదల ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.

టికెట్ల అమ్మకాలపైనే భవిష్యత్తు!

రైల్వే శాఖ ప్రస్తుతం ఈ హాల్టింగ్‌ను ప్రయోగాత్మకంగా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నందలూరు స్టేషన్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు జరిగే టికెట్‌ అమ్మకాలను రైల్వే అధికారులు నిరంతరం సమీక్షించనున్నారు. ఇక్కడ టికెట్ల విక్రయాలు ఆశాజనకంగా ఉంటేనే భవిష్యత్తులో ఈ హాల్టింగ్‌ శాశ్వతంగా కొనసాగుతుంది. కాబట్టి, స్టాపింగ్‌ నిరంతరాయంగా కొనసాగేలా చూసే బాధ్యత స్థానికులపైనే ఉందని రైల్వే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, వందలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ హాల్టింగ్‌ను శాశ్వతం చేయాలని రైల్వే కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement