ప్రొద్దుటూరు : మున్సిపాలిటీ పరిధిలోని అమ్మవారిశాల వెనుక వీధిలో ఉన్న వాసు స్టూడియో పక్కన 11/461 ఇంటినంబర్ గల స్థలంలో అధికార పార్టీ నేత నిబంధనలకు విరుద్దంగా కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపడుతున్నాడు. మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం 50 అడుగుల రోడ్డును వదిలిపెట్టి కాంప్లెక్స్‌ను నిర్మించాల్సి ఉంది. అయితే సదరు అధికార పార్టీ నేత నిబంధనలను పక్కన పెట్టి గతంలో ఏవిధంగా ఉందో అలాగే నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు ఇదే నిర్మాణాన్ని పరిశీలించి కొద్ది రోజులు పనులు నిలిపివేశారు. మళ్లీ యధావిధిగా పనులు ప్రారంభమవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ నిధి మీనా ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేవలం అధికార పార్టీ నేతల ప్రభావం కారణంగానే అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రమోహన్‌కు ఫోన్ చేసి సాక్షి వివరణ కోరగా ఆయన స్పందించలేదు.
పట్టించుకోని మున్సిపల్ అధికారులు


