ఖాజీపేట : అధికార బలంతో విర్రవీగుతున్న కూటమి నేతల దౌర్జన్యాలు విద్యా వ్యవస్థను కూడా వదలడం లేదు. ప్రశాంతమైన వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలను టీడీపీ నాయకులు తమ రౌడీయిజంతో, బెదిరింపులతో అర్ధాంతరంగా వాయిదా వేయించిన సంఘటన ఖాజీపేట మండలంలో తీవ్ర కలకలం రేపింది. క్షేత్రస్థాయిలో తమకు బలం లేదని, ఎన్నికలు జరిగితే ఓటమి ఖాయమని ముందే తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. నిస్సిగ్గుగా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఖాకీల అండతో పసుపు నేతల రుబాబు!
సజావుగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో సహకరించాల్సిన పోలీసులు.. ఇక్కడ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాకీలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు పోలీసులు పరోక్షంగా సహకరిస్తూ, మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ అడుగుతున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను తీవ్రంగా అడ్డుకోవడం ఖాజీపేటలో కలకలం రేపింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ.. కేవలం పసుపు నేతలకు లబ్ధి చేకూర్చేందుకే పోలీసులు వారితో చేతులు కలిపి ఎన్నికలు వాయిదా పడేలా చక్రం తిప్పారు.
67 స్కూల్స్ ఏకగ్రీవం..
ఆ రెండు చోట్లా ఓటమి భయంతోనే డ్రామా!
ఖాజీపేట మండలవ్యాప్తంగా మొత్తం 69 పాఠశాలలు ఉండగా.. అందులో 67 పాఠశాలల్లో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా, ఏకగ్రీవంగా ముగిశాయి. అయితే కూటమి నేతలకు పట్టులేని దుంపలగట్టు, దుంపలగట్టు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి ఎన్నికలను వాయిదా వేయించారు.
దుంపలగట్టు హరిజనవాడలోనూ
18 వర్సెస్ 12 మెజారిటీ!
దుంపలగట్టు హరిజనవాడ పాఠశాలలో మొత్తం 40 మంది విద్యార్థులకు 30 ఓట్లు ఉన్నాయి. ఇందులో ఏకంగా 18 మంది ఓటర్లు వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన అనుకూలంగా ఉండగా.. కేవలం 12 మంది మాత్రమే టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. ఇక్కడ ఎన్నిక జరిగితే ఎలాగూ గెలవడం సాధ్యం కాదన్న పక్కా సమాచారంతో టీడీపీ నాయకులు కావాలనే గొడవలకు దిగారు. పసుపు నేతల అక్రమాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు దీటుగా అడ్డుకుని, ఎన్నిక జరగాల్సిందేనని పట్టుబట్టాయి. దాంతో ఓటమి ఖాయమని భయపడిన టీడీపీ ఓటర్లు వెనుతిరిగి వెళ్లిపోయారు. స్కూల్లో కేవలం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన తల్లిదండ్రులు మాత్రమే ఉన్నప్పటికీ.. పై అధికారుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్ల కారణంగానే ఉపాధ్యాయుల చేత ఎన్నికను బలవంతంగా వాయిదా వేయించారు.
5 వర్సెస్ 2 మెజారిటీ ఉన్నా గూండాయిజం!
మరోవైపు దుంపలగట్టు గ్రామంలోని పాఠశాలలో మొత్తం 8 ఓట్లకు ఏడుగురు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఏడుగురిలో ఏకంగా ఐదుగురు ఓటర్లు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండగా.. కేవలం ఇద్దరు మాత్రమే టీడీపీ వైపు ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉంటే రెండు చోట్లా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డికి చెందిన ప్యానెల్ అభ్యర్థులు ఏకపక్షంగా ఘన విజయం సాధించేవారు. కానీ, తమకు ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగి, ఖాకీల అండతో అధికారులపై ఒత్తిడి తెచ్చి దారుణంగా ఎన్నికలను వాయిదా వేయించారు.
ఖాజీపేట స్కూల్ కమిటీ ఎన్నికల్లో పసుపు నేతల ఓటమి భయం.. ఖాకీల అండతో దౌర్జన్యాల జాతర
దుంపలగట్టులో 5 వర్సెస్ 2, హరిజనవాడలో 18 వర్సెస్ 12 మెజారిటీ ఉన్నా ఎన్నికల వాయిదా డ్రామా
రెడ్యం వెంకట సుబ్బారెడ్డి వర్గం గెలుపును అడ్డుకునేందుకు అధికారులపై కూటమి నేతల తీవ్ర ఒత్తిళ్లు


