సిద్ధవటం : సిద్దవటంలోని దిగువపేట గాంధీ వీధికి చెందిన కల్లోజి వర్షశ్రీ (21) అనే బీటెక్ విద్యార్థిని బలవన్మరణం చెందినట్లు ఎస్‌ఐ హారిక తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కల్లోజి రామచంద్ర, ఇందిర దంపతుల కుమార్తె కల్లోజి వర్షశ్రీ అన్నమయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుందన్నారు. గత 3 నెలలుగా కడుపునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు వైద్యం చేయించారన్నారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా విపరీతమైన పొత్తికడుపు నొప్పి రావడంతో భరించలేక బెడ్ రూమ్‌లో తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి ఇందిర చెప్పారన్నారు. కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. విద్యార్థిని తల్లి ఇందిరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి, జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


