‘స్మార్ట్‌ కిచెన్‌’ పప్పులో బల్లిపై విచారణ | - | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌ కిచెన్‌’ పప్పులో బల్లిపై విచారణ

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

మైదుకూరు : మైదుకూరు మండలం జీవీ సత్రం హైస్కూల్‌లోని స్మార్ట్‌ కిచెన్‌లో వండిన మధ్యాహ్న భోజనం పప్పులో బల్లి పడిన విషయంపై శనివారం బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్‌, వెలుగు పీడీ రాజ్యలక్ష్మి, మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్‌ తదితరులు విచారణ చేశారు. స్మార్ట్‌ కిచెన్‌ నుంచి జీవీ సత్రం హైస్కూల్‌ విద్యార్థులకు శుక్రవారం అందించిన పప్పులో బల్లి పడగా భోజనాన్ని వడ్డించే సిబ్బంది గమనించి ఆ విషయాన్ని పాఠశాల హెడ్మాస్టర్‌ జయప్రకాష్‌రెడ్డికి తెలిపారు. ఆయన ఆ పప్పును పార వేయించారు. అయితే అప్పటికే ముగ్గురు ఆరో తరగతి విద్యార్థులు ఆ పప్పును భోజనంలో కలుపుకొని తిని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జీవీ సత్రం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యుడు శ్రీనాథ్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాఠశాలకు చేరుకుని పిల్లలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మాత్రలను అందజేశారు. పప్పులో పడిన బల్లి చితికి పోకపోవడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పప్పులో బల్లి పడిన విషయం టీవీల్లో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో రావడంతో అధికారులు శనివారం పాఠశాల వద్దకు చేరుకుని విచారణ నిర్వహించారు. స్మార్ట్‌ కిచెన్‌ నిర్వహణ బాధ్యత తీసుకున్న వెలుగు ఏపీఎం జయరాజ్‌ వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండటంతో.. వంట మనుషులను, పాఠశాలల్లో పిల్లలకు భోజనం వడ్డించిన పూర్వ వంట ఏజెన్సీ నిర్వాహకులు లీలావతి, ఆమె భర్త చంద్రలను అధికారులు విచారణ చేశారు. పప్పులోకి బల్లి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు భోజనం వడ్డించిన వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బల్లి పడిన విషయాన్ని బయటి వ్యక్తులకు ఎందుకు తెలియజేశారని అడిగినట్టు సమాచారం. పాఠశాల హెచ్‌ఎం జయప్రకాష్‌రెడ్డితో మాట్లాడి సంఘటన గురించి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కూడా పిలిపించి వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. విచారణలో మైదుకూరు తహసీల్దార్‌ రాజసింహ నరేంద్ర, అర్బన్‌ సీఐ రమణారెడ్డి, ఎంఈఓ–2 నరహరిశర్మ పాల్గొన్నారు.

కేసు నమోదు

స్మార్ట్‌ కిచెన్‌లో వండిన పప్పులో బల్లి పడిన సంఘటనపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్‌ కిచెన్‌ బాధ్యతలు చూస్తున్న మండల ఎంఈఓ–2 నరహరి శర్మ నుంచి ఫిర్యాదు తీసుకుని, జీవీ సత్రం హైస్కూల్‌లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించే పూర్వ వంట ఏజెన్సీ నిర్వాహకులపైన లీలావతి, ఆమె భర్త చంద్ర, మరికొందరిపై కేసు నమోదు చేస్తున్నట్టు సమాచారం.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

పప్పులో బల్లి పడిన సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నియోకజవర్గ అధ్యక్షుడు భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజనం పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించినదని, అలాంటి భోజనం తయారీలో పర్యవేక్షణ లేకపోవడం, నిర్లక్ష్యం చూపడం తీవ్రమైన విషయాలని ఆయన పేర్కొన్నారు.

అస్వస్థతకు గురైన విద్యార్థుల

ఆరోగ్యంపై ఆరా

పాఠశాలకు వచ్చిన పలు శాఖల

అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement