● వైఎస్సార్‌సీపీ మాజీ కౌన్సిలర్ ప్రహరీ కూల్చివేతకు మార్కింగ్
ఎర్రగుంట్ల: మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపింది. కాలనీలోని పుష్పగిరి మాన్యంలో ఉన్న వైఎస్సార్‌సీపీ మాజీ కౌన్సిలర్ దేరంగుల వెంకటలక్షుమ్మ ఇంటి ప్రహారీని తాగునీటి పైపులైన్ సాకుతో కూల్చివేయడానికి మున్సిపల్ అధికారులు శనివారం హడావిడిగా మార్కింగ్ ఇచ్చారు. ఇటీవల విద్యుత్ స్తంభం ఏర్పాటు విషయంలో స్థానిక కూటమి నేతతో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ ఇల్లే లక్ష్యంగా ఈ చర్యలకు దిగుతున్నారని ఆమె కుమారులు శ్రీనివాసులు, గోపి వాపోయారు. అదే పైపులైన్ పక్క ఇళ్ల కింద కూడా ఉన్నా, కేవలం తమ ఇంటికే మార్కింగ్ ఇవ్వడం వెనుక రాజకీయ కక్ష స్పష్టంగా కనిపిస్తోందని, నిబంధనల ప్రకారం మొత్తం సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పరామర్శ:ఈ విషయం తెలుసుకున్న జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి శనివారం బాధితుల ఇంటికి వెళ్లి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైపులైన్ నెపంతో ఆక్రమణలు జరిగాయని భావిస్తే ముందుగా టీపీఓ ( ఖ్కీౖ) సిబ్బందితో ఆ ఏరియా అంతా సర్వే చేయించి, ఆ లైన్ వెంబడి ఉన్న ఆక్రమణలన్నింటినీ ఒకేలా తొలగించాలన్నారు. అలా కాకుండా కేవలం వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇల్లే టార్గెట్ చేయడం దుర్మార్గమన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శేషఫణితో ఎమ్మెల్సీ ఫోన్‌లో మాట్లాడారు. కూటమి నేతలు చెప్పారని తమ పార్టీ శ్రేణులను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ మెంబర్ గిరిధర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ తుంగా వెంకటరామిరెడ్డి, ఉపమండలాధ్యక్షుడు వెంకటమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ వివరణ: ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ శేషఫణి వివరణ ఇస్తూ.. కాలనీలో తాగునీటి సరఫరాను మెరుగుపరచడం కోసమే పైపులైన్‌పై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామన్నారు. అందులో భాగంగానే అన్నింటిపైనా సర్వే చేసి మార్కింగ్ ఇస్తున్నామని, మంగళవారం నాటికి అందరికీ గడువు విధించామని తెలిపారు.


